Fungal Infections: చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవి దురద, ఎరుపు, పొలుసులు రావడం వంటి లక్షణాలతో బాధపెడతాయి. టీనేజ్ పిల్లలు, పెద్దలు సాధారణంగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. అయితే వీటిని తగ్గించుకోవడానికి కొన్ని సహజ పద్ధతులు చాలా సహాయపడతాయి. అయితే, ఏదైనా కొత్త చికిత్స ప్రారంభించే డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.
హోం రెమెడీస్‌తో ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చెక్:
టీ ట్రీ ఆయిల్:
టీ ట్రీ ఆయిల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఒక శక్తివంతమైన హోం రెమెడీ. ఇందులో యాంటీ ఫంగల్ , యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఈ ఆయిల్‌ను కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌తో కలిపి ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంలో రోజుకు రెండుసార్లు రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే.. దీనిని నేరుగా చర్మంపై అప్లై చేయకూడదు.
వెల్లుల్లి:
వెల్లుల్లిలో అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఫంగస్‌కు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నలిపి, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ లా చేసి, ఇన్ఫెక్షన్ ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో క్యాప్రిలిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లం ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. పరిశుభ్రమైన చేతులతో కొబ్బరి నూనెను ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంలో రోజుకు 2-3 సార్లు రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఆమ్ల స్వభావం ఉండటం వల్ల ఫంగస్ వృద్ధిని అడ్డుకుంటుంది. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి, దూదితో ఇన్ఫెక్షన్ ఉన్న చోట రోజుకు రెండుసార్లు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
పసుపు:
పసుపులో కుర్కుమిన్ అనే యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మంచి నివారణ. పసుపును నీటితో కలిపి పేస్ట్ లాగా చేసి.. ప్రభావిత ప్రాంతంలో రాసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచిది.
Also Read: తరచుగా తుమ్ముతున్నారా ? కారణాలివేనట !
పరిశుభ్రత ముఖ్యం:
ఏ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా నివారించాలంటే శుభ్రత చాలా అవసరం. ప్రభావిత ప్రాంతాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఇవి చర్మానికి గాలి తగిలేలా చేస్తాయి. ఇతరుల టవళ్ళు, దుస్తులు, చెప్పులు వాడటం మానుకోవాలి.
ఈ హోం రెమెడీస్ కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. సమస్య తీవ్రంగా ఉంటే, లేదా తగ్గకపోతే, డాక్టర్ సంప్రదించి సరైన మందులు తీసుకోవడం చాలా అవసరం.