Heatstroke Herbal Remedies| వేసవిలో వాతావరణంలో ఉష్టోగ్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉంటుంది. దీని వల్ల వడదెబ్బ (హీట్ స్ట్రోక్) ప్రమాదం కూడా పెరుగుతూ ఉంటుంది. వేడిగా ఉండే వాతావరణంలో ఎక్కువ సమయం గడిపే వారికి ఈ వడదెబ్బ లాంటి ప్రాణాంతకమైన ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ఈ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో ఆరోగ్య జాగ్రత్తల కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రకృతిపరమైన చిట్కాలు, చిన్న చిన్న జాగ్రతలు పాటిస్తే చెమటలు పోసే ఎండాకాలంలోనూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ముందుగా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి
వేసవిలో శరీరంలోని నీటి శాతం బాగా తగ్గిపోతుంది. చెమటలు ఎక్కువ పోయడం లేదా శరీర ఉష్ణోగ్రతకు తోడు వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువ కావడంతో శరీరానికి చల్లగా ఉంచేందుకు ఎక్కువ నీరు అవసరం అవుతుంది. లేకపోతే వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్లే. నేచురోపతి వైద్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్లు తప్పనిసరిగా తాగాలి. కొబ్బరి బొండం నీటిలో నిమ్మకాయ రసం, లేదా బెల్లం, ఉప్పు, నీరు, నిమ్మరసం మిశ్రమం, హెర్బల్ టీ లాంటివి వేసుకొని తరుచూ తాగుతూ ఉండాలి. దీంతో వేడి కారణంగా శరీరం కోల్పోయిన ఎలెక్ట్రోలైట్స్ లవణాలు తిరిగి భర్తీ అవుతాయి.
హైడ్రోథెరపీ: క్రమం తప్పకుండా తల, మెడ, వెనెముక, నడుము భాగాలపై కోల్డ్ ప్రెస్ చేస్తూ ఉండాలి. అలాడే శరీరం చల్లగా, ఫ్రెష్ గా ఉండేందుకు చన్నీటితో ప్రతిరోజు స్నానం చేయాలి.
ప్రకృతిపరమైన లభించే మూలికలు
ప్రకృతి ద్వారా లభించే కొన్ని మూలికల్లో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, చల్లదనం అందించే గుణాలున్నాయి. వాటిలో కొన్ని ఇంటి కిచెన్ లో లభిస్తాయి.
ధనియా గింజలు – వంటగదిలో లభించే ధనియా గింజలను నీటిలో మరిగించి, చల్లబరిచి ఆ నీటిని తాగితే తక్షణమే శరీరం చల్లబడుతుంది.
ఆలోవేరా – దీన్ని స్మూతీ జ్యూస్ లాగే చేసుకొని తాగాలి. లేదా చర్మంపై అప్లై చేయాలి. ఈ రెండు విధాలతోను శరీరంలో వేడి తగ్గుతుంది.
ఉసిరి జ్యూస్ – ఆమ్లా లేదా ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
పుదీన, తులసి – నీటిలో మరిగించి ఆ నీటి తాగవచ్చు. లేదా టీ చేసే సమయంలో అందులో పుదీన, లేదా తులసి వేసుకొని ప్రత్యేక టీ తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే శరీరం రిఫ్రెష్ అవుతుంది.
ఆహారంలో మార్పులు చేయాలి..
నేచురోపతి ప్రకారం.. వేసవిలో మనం తినే ఆహారం వాతావరణానికి అనుగుణంగా ఉండాలి.
నీటి శాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ – పుచ్చకాయ, కర్బూజా, కుకుంబర్, ఆరెంజ్ పండ్లు తింటే ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు, ఇందులోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఉల్లి – ఇందులోని క్వెరసెటిన్ వేడి తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
వేసవిలో ఆయిలీ లేదా పచ్చడి లాంటి ఆహారం తినకుడదు. ఇవి శరీరంలో వేడిని మరింత పెంచుతాయి.
పెరుగు, మజ్జిగ లాంటివి తాగితే జీర్ణక్రియకు మంచిది, శరీరానికి చల్లదనం కూడా అందిస్తాయి.
వదులుగా ఉన్న బట్టలు ధరించాలి
వేసవిలో కాటన్ తో చేసిన లూజుగా ఉండే బట్టలు ధరించాలి. పైగా లైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రత మరీ విపరీతంగా ఉంటే తడి టవల్ అందుబాటులో ఉంచుకోవాలి. వీలైనంత వరకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల సమయం వరకు బయటికి వెళ్లకూడదు. ఇల్లు, ఆపీసులో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
యోగా
శీతలి, శీత్కారి ప్రాణాయామం వంటి యోగాసనాలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి.
నాడీ శోధనా ప్రాణాయామం శరీరంలో ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. వేడిగా ఎక్కువగా ఉన్న సమయంలో శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు చేయకూడదు. శరీరానికి విశ్రాంతినిచ్చేందుు యోగ నిద్ర లాంటి టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి.
Also Read: గ్రీన్ టీతో అద్భుతమైన ఫేస్ ప్యాక్స్.. మచ్చలులేని ముఖం మీ సొంతం
ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్
శరీరంలో అలసట, కళ్లు తిరగడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తల, మెడ, చంకల్లో ఐస్ ప్యాక్స్ అప్లై చేయాలి. నిమ్మరసం కలిపిన నీరు, ఉప్పు, లేదా ఓఆర్ఎస్ అందులో జిలకర, సొంపు లాంటివి కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
వడదెబ్బతో బాధపడుతున్న రోగి ఆరోగ్యం కుదుట పడేంత వరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. రోగి చల్లని వాతావరణంలో ఉండాలి. క్రమం తప్పకుండా చల్లనీరు తాగుతూ ఉంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.