Turmeric Milk: వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. ఈ సమయంలో వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి, జీర్ణ సమస్యల వంటివి ఈ సీజన్‌లో సర్వసాధారణం. ఇలాంటి సమయంలో మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికి పసుపు పాలు (Turmeric Milk)ఒక అద్భుతమైన, సాంప్రదాయ పరిష్కారం. పసుపులో ఉండే “కర్కుమిన్” (Curcumin) అనే సమ్మేళనం, పాలలో ఉండే పోషకాలు కలిసి వర్షాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
వర్షాకాలంలో పసుపు పాలు ((Turmeric Milk) తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పసుపులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, శరీరాన్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటిని నివారించడంలో కూడా సహాయపడుతుంది.
మంటను తగ్గిస్తుంది :
వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు పెరిగే అవకాశం ఉంది. పసుపులో ఉండే కర్కుమిన్ సహజసిద్ధమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో మంటను తగ్గించి, కీళ్ల నొప్పులు, ఇతర శారీరక అసౌకర్యాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
వర్షాకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. పసుపు పాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పసుపు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజ పరుస్తుంది. అంతే కాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు కూడా సహాయపడుతుంది.
గాయాలను నయం చేస్తుంది:
పసుపులో యాంటీసెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చిన్న గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు పసుపు పాలు తాగడం వల్ల లోపలి నుంచి గాయాలు త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది.
మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది:
వర్షాకాలంలో వాతావరణం చల్లగా.. నిస్సత్తువగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగడం వల్ల శరీరానికి వెచ్చదనం లభించి, మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతే కాకుండా ఇది నిద్రలేమి సమస్యలను తగ్గించి, మంచి, గాఢమైన నిద్రను ప్రోత్సహిస్తుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:
పసుపు రక్తాన్ని శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో వచ్చే చర్మ ఇన్ఫెక్షన్లు, మొటిమలను తగ్గించడంలో కూడా పసుపు ఉపయోగపడుతుంది.
Also Read: వర్షాకాలంలో.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి ! చేశారో అంతే..
గొంతు నొప్పి నుంచి ఉపశమనం:
వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పి, పొడి దగ్గుకు పసుపు పాలు ఒక అద్భుతమైన హోం రెమెడీ. పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గొంతులోని మంటను తగ్గించి.. ఉపశమనాన్ని అందిస్తాయి.
పసుపు పాలు ఎలా తయారు చేయాలి ?
ఒక గ్లాసు పాలు, 1/2 టీస్పూన్ పసుపు పొడి, చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా తేనె లేదా బెల్లం (రుచికి) తీసుకోండి. పాలలో పసుపు, మిరియాల పొడి కలిపి బాగా మరిగించండి. పాలు గోరువెచ్చగా అయ్యాక తేనె లేదా బెల్లం కలిపి తాగండి.