Snooze Button: ఉదయం అలారం మోగగానే ‘ఇంకో ఐదు నిమిషాలు నిద్రపోదాం’ అని స్నూజ్ బటన్ నొక్కేవాళ్లు చాలామంది ఉన్నారు. ఈ చిన్న అలవాటు హాయిగా, సౌకర్యవంతంగా అనిపించినా, నిజంగా మన నిద్ర ఆరోగ్యాన్ని, రోజువారీ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. అమెరికాలోని పరిశోధకులు స్లీప్ సైకిల్ యాప్ ద్వారా 21,000 మంది నుంచి 30 లక్షల రాత్రుల నిద్ర డేటాను సేకరించి, స్నూజ్ బటన్ వల్ల నిద్ర నాణ్యత ఎలా పాడవుతుందో వివరించారు. ఈ డేటా చూస్తే, స్నూజ్ బటన్ వాడకం ఊహించిన దానికంటే ఎక్కువగా మన జీవితంపై ప్రభావం చూపిస్తోంది.
స్నూజ్ బటన్ సాధారణమా?
ఈ అధ్యయనం ప్రకారం, 56% సార్లు ప్రజలు అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కుతున్నారు. సగటున, స్నూజ్ చేసేవాళ్లు మంచం నుంచి లేవడానికి 11 నిమిషాలు ఆలస్యం చేస్తారు. చాలామంది, అంటే 80% కంటే ఎక్కువ మంది, ప్రతి ఉదయం స్నూజ్ బటన్ వాడుతూ సగటున 20 నిమిషాల పాటు అలారం మధ్య నిద్రపోతున్నారు. అయితే, ఈ ఇంకో ఐదు నిమిషాలు నిద్ర అనుకున్నంత మేలు చేయదు. బదులుగా, ఇది మన నిద్ర షెడ్యూల్‌ను గందరగోళం చేస్తుంది. ముఖ్యంగా, REM నిద్రను, అంటే జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణకు కీలకమైన నిద్ర దశను, ఇది దెబ్బతీస్తుంది. స్నూజ్ సమయంలో వచ్చే నిద్ర తేలికగా, అసంపూర్ణంగా ఉంటుంది. దీనివల్ల ఉదయం రిఫ్రెష్‌గా అనిపించకపోగా, మరింత అలసటగా, నీరసంగా ఉంటుంది.
ఎక్కువ వాడేది ఎవరు?
ప్రపంచవ్యాప్తంగా సగం కంటే ఎక్కువ మంది స్నూజ్ బటన్‌ను వాడుతున్నారు. వారం రోజుల్లో, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు, పని ఒత్తిడి, షెడ్యూల్స్ వల్ల ఉదయం లేవడం కష్టంగా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో స్నూజింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. వీకెండ్స్‌లో మాత్రం, ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం ఉండటం లేదా సహజంగా మేల్కొనడం వల్ల స్నూజ్ వాడకం తక్కువగా ఉంటుంది. దేశాల వారీగా చూస్తే, అమెరికా, స్వీడన్, జర్మనీలో స్నూజ్ బటన్ వాడకం ఎక్కువగా ఉంది. ఇక జపాన్, ఆస్ట్రేలియాలో ఈ అలవాటు తక్కువ. ఆసక్తికరంగా, 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వాళ్లు స్నూజ్ తక్కువగా వాడతారు. బహుశా, పని లేదా ఇతర బాధ్యతల వల్ల వారు వెంటనే లేవాల్సి ఉంటుందేమో.
స్నూజ్ ప్రమాదరకమా?
స్నూజ్ బటన్ నొక్కడం సహజంగా అనిపించినా, ఇది నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నూజ్ సమయంలో వచ్చే నిద్ర చాలా తేలికగా ఉంటుంది, శరీరానికి పూర్తి విశ్రాంతి ఇవ్వదు. దీనివల్ల రోజంతా అలసట, దృష్టి లోపం, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో, గందరగోళ నిద్ర షెడ్యూల్ గుండె జబ్బులు, డిప్రెషన్, ఆందోళన, జ్ఞాపకశక్తి బలహీనత వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. మన శరీరం, మెదడు సరిగ్గా పనిచేయడానికి రెగ్యులర్ నిద్ర దశలు చాలా ముఖ్యం. స్నూజ్ బటన్ ఈ దశలను గందరగోళం చేస్తూ, మనల్ని రోజంతా నీరసంగా ఉంచుతుంది.
ఏం చేయాలి?
నిపుణులు స్నూజ్ బటన్‌ను పూర్తిగా మానేయమని సలహా ఇస్తున్నారు. నిజంగా లేవగలిగే చివరి సమయానికి అలారం సెట్ చేయాలి. మొదటి అలారంతోనే మంచం దిగాలని డాక్టర్లు చెబుతున్నారు. రెగ్యులర్ నిద్ర షెడ్యూల్ పాటించడం చాలా కీలకం. రాత్రి 7-8 గంటలు నిద్రపోవడం, పడుకునే ముందు ఫోన్, టీవీ వంటి స్క్రీన్‌లను తగ్గించడం మంచిది. ఉదయం సులభంగా లేవడానికి కొన్ని చిన్న ట్రిక్స్ కూడా సహాయపడతాయి. ఉదాహరణకు, లేవగానే స్ట్రెచింగ్ చేయడం, తేలికపాటి వ్యాయామం చేయడం లేదా ఒక గ్లాసు నీళ్లు తాగడం వంటివి మిమ్మల్ని రిఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంచుతాయి.