Bone Health: మన శరీరానికి ఆధారాన్ని ఇచ్చేవి ఎముకలు. అవి గట్టిగా, బలంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎముకలు వయసు పెరిగే కొద్దీ బలహీనపడతాయి. అయితే.. చిన్నతనం నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో కూడా వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల టిప్స్ తప్పకుండా పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బలమైన ఎముకల కోసం కాల్షియం:
ఎముకల ఆరోగ్యానికి కాల్షియం చాలా ముఖ్యం. పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు, జున్ను), ఆకుకూరలు (పాలకూర, బ్రోకలీ), నువ్వులు, బాదం, చేపలు వంటి ఆహార పదార్థాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో ఈ పదార్థాలను చేర్చుకోవడం వల్ల ఎముకలు గట్టిగా ఉంటాయి. శరీరానికి ఎంత కాల్షియం అవసరమో డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకోవడం మంచిది.
విటమిన్ డి:
కాల్షియం శరీరానికి అందాలంటే విటమిన్ డి అవసరం. విటమిన్ డి లేకపోతే కాల్షియం ఎంత తీసుకున్నా లాభం ఉండదు. సూర్యరశ్మి విటమిన్ డికి ప్రధాన వనరు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కొద్దిసేపు ఎండలో ఉండటం మంచిది. అలాగే, సాల్మన్, ట్యూనా, గుడ్లు, పుట్టగొడుగులు వంటి ఆహార పదార్థాలలో కూడా విటమిన్ డి లభిస్తుంది.
వ్యాయామం:
ఎముకలు బలంగా ఉండాలంటే వ్యాయామం చాలా అవసరం. కండరాలు ఎలాగైతే వ్యాయామం చేస్తే బలపడతాయో.. అలాగే ఎముకలు కూడా. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు ఎముకలకు మంచివి. ఇవి ఎముకల సాంద్రతను పెంచుతాయి. బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలు ఒత్తిడికి లోనై మరింత బలపడతాయి.
పొగతాగడం, మద్యం మానుకోండి:
పొగతాగడం, అధికంగా మద్యం సేవించడం ఎముకల ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాట్లు ఎముకలను బలహీనపరిచి, వాటిని విరిగేలా చేస్తాయి. కాబట్టి.. ఆరోగ్యకరమైన ఎముకల కోసం ఈ అలవాట్లను మానుకోవాలి.
Also Read: రాజ్మా తింటే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి:
అధిక బరువు ఎముకలపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది కీళ్ళ నొప్పులకు, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ద్వారా ఎముకల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి:
40 ఏళ్లు పైబడిన వారు, ముఖ్యంగా మహిళలు, ఎముకల సాంద్రత పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇది ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించి.. చికిత్స తీసుకోవడానికి సహాయ పడుతుంది.
మంచి ఆహారం, సరైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎముకలను దృఢంగా ఉంచుకోవడం సాధ్యమే. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గమనించాలి.