Steel Pans: వంటగదిలో.. వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడానికి మనం పాత్రలను ఉపయోగిస్తాము. కానీ ఎలాంటి పాత్రలలో ఎలాంటి ఆహారాన్ని వండాలో మనలో చాలా మందికి తెలియదు. తొందరగా వంట పూర్తి చేయాలన్న ఆలోచనలో అన్ని రకాల వంటకాలను స్టీల్ పాత్రలలో చేసే అలవాటు చాలా మందిలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇది మన ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇదిలా ఉంటే.. ఐరన్, అల్యూమినియం పాత్రలలో కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలు వంటకూడదు.
వంటగదిలో మనం ఉపయోగించే పాత్రలలో స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు చాలా ముఖ్యమైనవి. ఇవి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. శుభ్రం చేయడానికి కూడా సులభమైనవి. అంతే కాకుండా అన్ని రకాల వంటకాలకు అనుకూలమైనవి. అయితే.. అన్ని రకాల వంటకాలకు స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు సరైనవి కావు. కొన్ని సందర్భాలలో వీటిని ఉపయోగించడం వల్ల ఆహారం పాడవడమే కాకుండా.. పాత్రలు కూడా దెబ్బతింటాయి. అందుకే ఆహార పదార్థాలను వండేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరం.
స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలలో వంట చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఎక్కువ సమయం వండే ఆహారాలు: స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు సాధారణంగా సన్నగా ఉంటాయి. ఎక్కువ సమయం తీసుకునే వంటకాలను వీటిలో వండితే, పాత్ర అడుగుడున అంటుకుపోవడం, మాడిపోవడం జరుగుతుంది. దీనివల్ల వంటకానికి రుచి మారిపోవడమే కాకుండా, పాత్ర శుభ్రం చేయడం కూడా కష్టమవుతుంది.
ఉప్పును ముందుగానే వేయడం: పాస్తా లేదా మాకరోనీ వంటి వంటకాలను వండేటప్పుడు, పాత్రలో నీటిని మరిగేటప్పుడు ఉప్పు వేయడం వల్ల స్టెయిన్ లెస్ స్టీల్ పాత్ర అడుగున తెల్లటి లేదా నల్లటి మరకలు ఏర్పడతాయి. ఈ మరకలు శాశ్వతంగా ఉండిపోతాయి. అందువల్ల.. నీరు మరిగిన తర్వాత మాత్రమే ఉప్పును కలపాలి.
ఎక్కువ ఉష్ణోగ్రత:స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల రంగు మారడం, వాటి నాణ్యత తగ్గడం వంటివి జరగుతాయి. తక్కువ నుంచి మధ్యస్థ మంట మీద వంట చేయడం మంచిది.
మైక్రోవేవ్ లో స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు వాడకూడదు:
మైక్రోవేవ్‌లో స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. మైక్రోవేవ్ ఓవెన్ విద్యుదయస్కాంత తరంగాల ద్వారా ఆహారాన్ని వేడి చేస్తుంది. స్టెయిన్ లెస్ స్టీల్ ఒక లోహం కాబట్టి, ఇది ఈ తరంగాలను ప్రతిబింబిస్తుంది. దీనివల్ల మైక్రోవేవ్ ఓవెన్ కు నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా ప్రమాదకరమైన విద్యుత్ స్పార్క్స్ కూడా ఏర్పడతాయి. అందుకే.. మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్-సేఫ్ గిన్నెలు లేదా గాజు పాత్రలు వాడటం ఉత్తమం.
Also Read: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?
స్టెయిన్ లెస్ స్టీల్‌కు ప్రత్యామ్నాయాలు:
నాన్-స్టిక్ పాన్స్ : గుడ్లు, చేపలు వంటివి వండడానికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. వీటిలో ఆహారం అంటుకోదు, కాబట్టి శుభ్రం చేయడం సులభం.
కాస్ట్ ఐరన్ : తక్కువ నుంచి అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం వండాల్సిన వంటకాలకు, ఉదాహరణకు వేపుళ్లు, కూరలు, స్టెయిన్ లెస్ కు బదులుగా కాస్ట్ ఐరన్ పాత్రలు ఉత్తమం.
మట్టి పాత్రలు : వీటిలో వంట చేయడం వల్ల ఆహారానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. మట్టి పాత్రలు వంటను నెమ్మదిగా చేస్తాయి. ఇది పోషకాలు కోల్పోకుండా చూస్తుంది.
మంచి నాణ్యత గల మందమైన స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను ఉపయోగించడం వల్ల ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. ఏ పాత్రనైనా దాని స్వభావం బట్టి వాడుకోవడం ద్వారా వంటకానికి రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయి.