Indian railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రైల్వే వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంటుంది. దేశ వ్యాప్తంగా 7400 రైల్వే స్టేషన్లను, సుమారు లక్ష కిలో మీటర్ల రైల్వే ట్రాక్స్ ను కలిగి ఉంది. నిత్యం 20 వేల రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. వీటిలో సుమారు 13 వేల ప్యాసింజర్ రైళ్లు ఉండగా, మరో 7 వేల గూడ్స్ రైళ్లు ఉన్నాయి. నిత్యం 2 కోట్ల మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతుంది భారతీయ రైల్వే. తక్కు వ ఖర్చుతో ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది రైల్వే ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక భారతీయ రైల్వేలోకి వందేభారత్ ఎక్స్ ప్రెస్ అడుగు పెట్టడంతో మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని పొందుతున్నారు ప్రయాణీకులు.
ఇప్పటికీ బ్రిటిషర్ల చేతిలో ఓ రైల్వే లైన్
ఇక ఇండియన్ రైల్వేలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మన దేశంలో రైల్వే లైన్లను ఏర్పాటు చేసింది బ్రిటిషర్లు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని రైల్వేల గురించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1951లో దేశంలోని రైల్వేలన్నీ జాతీయం చేయబడ్డాయి. కానీ, ఒకే ఒక్క రైల్వే లైన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వ నియంత్రణలోకి రాలేదు. అదే మహారాష్ట్రలోని అమరావతి నుంచి ముంబై ఓడరేవుకు విస్తరించి ఉన్న నారో-గేజ్ రైల్వే లైన్. దీనిని ఉపయోగిస్తున్నందుకు గాను భారతీయ రైల్వే బ్రిటిషర్లకు రాయల్టీ చెల్లిస్తూనే ఉంది. బ్రిటిష్ కంపెనీ క్లిక్ నిక్సన్ & కంపెనీ ఈ డబ్బులను తీసుకుంటుంది.
ఎందుకు ఈ రైల్వే లైన్ ప్రభుత్వ ఆధీనంలో లేదంటే?
మహారాష్ట్రలోని అమరావతి పత్తి సాగుకు ప్రసిద్ధి చెందింది. అమరావతి నుంచి ముంబై ఓడరేవుకు పత్తిని రవాణా చేయడానికి బ్రిటిషర్లు అప్పట్లో ఈ రైల్వే ట్రాక్ ను నిర్మించారు. దీనిని నిర్మించడానికి బ్రిటన్ కు చెందిన క్లిక్ నిక్సన్ & కంపెనీ సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీని స్థాపించింది. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఈ ట్రాక్ ను ఉపయోగించుకునేందుకు కంపెనీకి ఏటా రాయల్టీలు చెల్లించాలని భారతీయ రైల్వే ఈ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఎందుకంటే, దీనిని బ్రిటిష్ ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ కంపెనీ నిర్మించింది. ఈ ట్రాక్ మీద అప్పట్లో శకుంతల ప్యాసింజర్ రైలును నడిపించారు. ఇప్పుడు నడవడం లేదు. కానీ, ఈ ప్రాంత ప్రజలు దీనిని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
మూడుసార్లు నిలిచిపోయిన రైల్వే సర్వీసులు
5 కోచ్ లతో కూడాని శకుంతల ఎక్స్ ప్రెస్ రోజుకు 800 నుండి 1,000 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లేది. కానీ, మొదటిసారిగా 2014లో, రెండోసారి 2016లో ఈ రైల్వే సర్వీసులు నిలిపివేశారు. ఈ రైలు చివరి సారిగా 2020లో నడిచింది. ప్రస్తుతం మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని అమరావతి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నారో గేజ్ ను బ్రాడ్ గేజ్ గా మార్చాలని కోరుతున్నారు. ఈ ట్రాక్ బ్రిటీష్ కంపెనీ యాజమాన్యంలో ఉండటంతో సరైన నిర్వహణ లేక పరిస్థితి క్షీణించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ట్రాక్ పై రైలు సేవలను నిలిపివేయాలని నిర్ణయం అధికారులు తీసుకున్నారు.
Read Also: సికింద్రాబాద్ నుంచి 18 రైళ్లు డైవర్ట్, కారణం ఏంటంటే?