Darshan Arrest Case: కర్ణాటకలో అతడి కటౌట్ పడితే థియేటర్ల దగ్గర పూల జాతర జరిగేది. అతడి మాట కోసం, ఒక చూపు కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉండేవారు. కానీ, ఆ కీర్తి, ఆ హోదా, ఆ అంధకారం వెనుక దాగున్న అహంకారం ఒక మనిషి జీవితాన్ని ఇంతలా మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అవును.. కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టయి అప్పుడే రెండేళ్లు పూర్తయ్యింది.
Read also-లవ్ ఫెయిల్యూర్‌పై.. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల ఎమోషనల్ కామెంట్స్!
2024 జూన్ 11.. కన్నడ ఇండస్ట్రీ చరిత్రలోనే ఒక బ్లాక్ డే. తన ప్రియురాలు పవిత్రా గౌడను సామాజిక మాధ్యమాల్లో తప్పుగా కామెంట్ చేశాడన్న కోపంతో, తనను ప్రాణంగా ప్రేమించే రేణుకాస్వామి అనే ఒక సామాన్య అభిమానిని దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్, పవిత్ర ఇద్దరూ అరెస్టయ్యారు. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఆ రెండు రోజుల తర్వాత చట్టం తన చేతులను వీరికి వేసింది.
కష్టసుఖాల్లో తోడుండి, ఒక స్టార్ హీరోగా ఎదిగే వరకు వెన్నంటి నిలిచిన భార్యను, కంటిపాపలా చూసుకోవాల్సిన పిల్లలను వదిలేశాడు. పరాయి మోహంలో పడి, ప్రియురాలి సాంగత్యమే సర్వస్వం అనుకున్నాడు. ఒక తప్పుడు బంధం, ఒక క్షణికావేశం.. కట్టుకున్న భార్య కన్నీళ్లను, పిల్లల భవిష్యత్తును బుడిదలో పోసిన పన్నీరు చేశాయి. ఒకప్పుడు స్టార్ వైభవాన్ని అనుభవించిన ఈ హీరో, నేడు సర్వస్వం కోల్పోయి శూన్యంలో నిలబడ్డాడు.
అధికార బలం, అంగబలం ఉంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చని అనుకున్నారేమో. కానీ, చట్టం ముందు అందరూ సమానమే అని కోర్టులు నిరూపించాయి. మధ్యలో ఒకసారి మధ్యంతర బెయిల్ వచ్చినా.. ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. కేసు తీవ్రతను బట్టి సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసి మరీ వెనక్కి పిలిచింది. ఆ తర్వాత ఎన్నిసార్లు బెయిల్ కోసం వేడుకున్నా న్యాయస్థానం కనికరించలేదు. ఎందుకంటే, అక్కడ పోయింది ఒక అనాథ ప్రాణం కాదు.. ఒక కుటుంబానికి ఆధారమైన కొడుకు ప్రాణం!
ఒకప్పుడు వందల మంది పనివాళ్లు, లగ్జరీ కార్లు, కోట్ల రూపాయల పారితోషికాలు.. కానీ నేడు? జైలు గదిలో కటిక నేలపై కాలం వెళ్లదీస్తున్నాడు దర్శన్. మరోవైపు ప్రియురాలు పవిత్రా గౌడ జైల్లో తన ‘ఆత్మకథ’ రాస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. రాసుకోవడానికి పేజీలు ఉన్నాయి కానీ, తప్పును సరిదిద్దుకోవడానికి కాలం వెనక్కి రాదు కదా! ఆ రాతలు వారి పశ్చాత్తాపాన్ని తెలియజేస్తున్నాయో లేదో కానీ, వారు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం మాత్రం అనుభవిస్తున్నారు.
Read also-‘Mega 158’ క్రేజీ అప్‌డేట్.. పొల్లాచిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిరు-బాబీ చిత్రం
అభిమానం అనేది ఒక వరప్రసాదం. అది ఉన్నంత కాలమే ఏ నటుడైనా దేవుడు. కానీ, చట్టాన్ని, మానవత్వాన్ని మించిపోయిన రోజున ఆ అభిమానమే అసహ్యంగా మారుతుంది. పోలీసులు అన్ని ఆధారాలతో సహా నేరాన్ని నిరూపించడంతో.. నిన్నటివరకు దేవుడిలా కొలిచిన అభిమానులే నేడు దర్శన్ వైపు చూడటానికి అసహ్యించుకుంటున్నారు. సమాజం నుంచి కనీస మద్దతు కూడా కరువైంది. శిఖరాగ్రాన నిలబడాల్సిన స్టార్ హీరో.. ఈరోజు సొంత తప్పిదాల వల్ల, క్షణికావేశం వల్ల జీరో అయిపోయాడు. కళ్ళు చెదిరే వెలుగుల నుంచి చీకటి కొట్టులోకి జారిపోయిన దర్శన్ జీవితం.. ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక, కళ్లు తెరిపించే ఒక చేదు నిజం!