Ahmedabad Plane Crash| అహ్మదాబాద్ లో గురువారం జరిగిన విమాన ప్రమాదం ఘటనలో కేవలం విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది మాత్రమే కాదు.. ఆ విమానం కూలి పడిన భవనంలోని వారు కూడా చనిపోయారు. ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపడింది. ఆ సమయంలో వైద్య విద్యార్థులు ఆ భవనంలో మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారు. విమానం వారి భవనంపై కూలిపడడంతో ఒక్కసారి భపయపడి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో అయిదుగురు ఎంబిబిఎస్ స్టూడెంట్స్ చనిపోయినట్లు సమాచారం. ఈ భయానక ఘటన జరిగిన సమయంలో అక్కడున్న విద్యార్థుల్లో ఒకరు తమకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో షేర్ చేశారు.
అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం విద్యార్థి అయిన 19 ఏళ్ల ధ్రువ్ గుజ్జర్.. గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు కాలేజీ హాస్టల్ మెస్‌లో భోజనం చేస్తున్నాడు. అప్పుడు ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. సీలింగ్ కూలిపోవడం చూసిన ధ్రువ్ వెంటనే టేబుల్ కింద దాక్కున్నాడు. కొన్ని క్షణాల్లో ఇతర విద్యార్థులు బయటకు పరుగెత్తడం చూసి, అతనూ బయటకు పరిగెత్తాడు. బయటకు వచ్చాక, ఒక విమానం హాస్టల్ పైకప్పుపై కూలినట్లు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు.
ఎయిర్ ఇండియా విమానం AI171.. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, మేఘనీ నగర్‌లోని జనావాసం ఉన్న ప్రాంతంలో కూలిపోయింది. ఈ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం.. లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో 53 మంది బ్రిటిష్, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ప్రయాణికులతో పాటు 169 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటివరకు 204 మృతదేహాలు సంఘటనా స్థలంలో కనుగొనబడ్డాయి.
విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్ భవనంలో రెండు అంతస్తులున్నాయి. విద్యార్థులు, ఫ్యాకల్టీ కోసం ఉన్న భవనాల సముదాయంలో ఈ మెస్ భవనం ఓ భాగం. ఈ మెస్.. విమానాశ్రయానికి 5 కి.మీ. దూరంలో ఉంది. విమానాల శబ్దం ఇక్కడ సాధారణమే అని ధ్రువ్ చెప్పాడు. కానీ ఈ రోజు వినిపించిన శబ్దం సాధారణం కాదు, భారీ పేలుడు శబ్దం వినిపించింది. మెస్‌లో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో 300 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ధ్రువ్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో 20-25 మంది విద్యార్థులు ఉండగా.. మొదటి అంతస్తులో ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదు.
విమానం కూలిన తర్వాత, మెస్ మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలింది. పైకప్పు కూలిపోవడంతో చాలా మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారు. బయటకు వచ్చిన ధ్రువ్.. విమానం టెయిల్ భాగం మెస్ పైకప్పుపై ఉన్నట్లు చూశాడు. విమానం కాక్‌పిట్, ముందు భాగం పక్కనే ఉన్న ఆరు అంతస్తుల భవనంలో కూలిపోయింది. ఈ భవనం యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీలో పనిచేసే డాక్టర్ల స్టాఫ్ క్వార్టర్స్. ఈ భవనంలో డాక్టర్ల కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. విమానం ఇంధన ట్యాంక్ పేలడంతో ఆ భవనం పూర్తిగా కాలిపోయింది.
ప్రమాదం కారణంగా గాయాలతో ఉన్న కొందరు జూనియర్ విద్యార్థులను ధ్రువ్ ట్రామా వార్డుకు తరలించేందుకు సహాయం చేశాడు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన కృష్ దభోయా.. ప్రమాదానికి 10 నిమిషాల ముందు మెస్ నుంచి బయటకు వెళ్లాడు. “మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రమాదం జరిగి ఉంటే.. మెస్‌లో చాలా మంది విద్యార్థులు ఉండేవారు, మరణాలు మరింత ఎక్కువగా ఉండేవి” అని అతను చెప్పాడు. మొదటి అంతస్తులో చాలా మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారని, హాస్టల్‌లో ఉండే విద్యార్థుల లెక్క తీస్తున్నామని దభోయా తెలిపాడు.
Also Read: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. 10 నిమిషాలు లేటు కావడంతో లండన్ ఫ్లైట్ మిస్
గాయపడిన వారి సంఖ్య పెరగడంతో ఆస్పత్రిలో విద్యార్థులు రక్తదానం చేయడానికి సిద్ధమయ్యారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అసోసియేషన్ చీఫ్ డాక్టర్ రోహన్ కృష్ణన్, మరణించిన వారి గుర్తింపు కష్టంగా ఉందని, సుమారు 50 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.