Priyanka Gandhi Parliament| కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తోందనిజజ సరైన చర్చలు జరగకుండా నిరోధిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఆరోపించారు. బిజేపీ నాయకులు వివిధ వ్యూహాలతో ఏ విధంగానైనా పార్లమెంటు సమావేశాల్లో చర్చలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం పార్లమెంటులో చర్చలను అడ్డుకుంటోందని.. ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నారని ప్రియాంక చెప్పారు. పార్లమెంటులో గత కొన్ని సమావేశాల్లో తాను పాల్గొని చూసింది ఏంటంటే.. ఏ విధంగానైనా చర్చలను నివారించడానికి ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిని సభలో మాట్లాడనీయకపోవడం ద్వారా సభలో గందరగోళం సృష్టిస్తుందని చెప్పారు.
“పార్లమెంటు సమావేశాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ సమర్థవంతంగా పని చేయకుండా అధికార పార్టీ నాయకులే ఆటంకం కలిగిస్తున్నారు. మోదీ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసమైంది. తరచుగా పార్లమెంటు వ్యవహారాలను ప్రతిపక్షం అడ్డగిస్తోందని అధికార పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ, అసలు సభ సక్రమంగా జరగడానికి ఈ ప్రభుత్వమే అడ్డంకిగా మారింది. ఇది బహుశా అందరికీ కొత్తగా కనిపించవచ్చు. ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నారు. ప్రజ సమస్యల గురించి మాట్లాడునివ్వడం లేదు.” అని పార్లమెంటు బయట ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: కస్టమర్ల వద్ద సర్వీస్ ఛార్జీలు వసూలు చేసే రెస్టారంట్లపై చర్యలు
సభలో నన్ను మాట్లాడనివ్వట్లేదు: రాహుల్ గాంధీ
అంతకుముందు ఇదే విషయాన్ని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీడియా ముందు చెప్పారు. లోక్‌సభలో తనను మాట్లాడేందుకు అనుమతించడంలేదని రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇటీవలే మీడియా ముందు చెప్పారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు మాత్రం ఇది సరైన మార్గం కాదన్నారు. మాట్లాడేందుకు అనుమతి కోరినా స్పీకర్ నిరాకరిస్తున్నారని.. తనకు ఏం జరుగుతోందో తెలియడంలేదని ఆయన స్పీకర్ తీరుపై విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వడం సంప్రదాయమని గుర్తు చేశారు. బుధవారం లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘నేను ఎప్పుడు లేచి నిలబడినా మాట్లాడేందుకు అనుమతించడం లేదు. మేం చెప్పాలనుకొనే అంశాలను లేవనెత్తేందుకు మాకు అనుమతి ఇవ్వడంలేదు. నేనేమీ చేయలేదు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా కూర్చున్నా. ఏడెనిమిది రోజుల నుంచి నన్ను మాట్లాడేందుకు అనుమతించట్లేదు. ఇదో కొత్త ఎత్తుగడ. ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు. ఇటీవల ప్రధాని మోదీ కుంభమేళా గురించి ప్రసంగించినప్పుడు నేను నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాలనుకున్నా.. కానీ ఎందుకో మాట్లాడేందుకు అనుమతించలేదు. మమ్మల్ని మాట్లాడేందుకు అనుమతించకపోవడం అప్రజాస్వామికం’’ అని రాహుల్ అన్నారు.
రాహుల్ వియత్నాం వెళ్లారు.. అమిత్ షా వ్యంగ్యం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందించారు. సభలో మాట్లాడే సమయంలో ఆయన వియత్నాంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం జరిగిన ‘టైమ్స్ నౌ సమ్మిట్ 2025’లో షా పాల్గొన్నారు. అక్కడ పలు అంశాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రాహుల్ విమర్శలపై సమాధానమిచ్చారు.
‘సభలో మాట్లాడటానికి నియమాలు ఉన్నాయనే విషయం బహుశా ప్రతిపక్ష నాయకుడికి తెలియకపోవచ్చు. సభలను ఇష్టానుసారం నడపలేము. బడ్జెట్‌పై చర్చల్లో మొత్తం సమయంలో 42 శాతం సమయం ఆయనకే ఇచ్చారు. పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు ఆయన వియత్నాంలో ఉన్నారు. తిరిగి వచ్చి మాట్లాడతానని పట్టుబట్టారు. పార్లమెంటు ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలా కాకుండా, నిబంధనలకు అనుగుణంగా నడుస్తుంది. వారు కూడా సభా నియమాలు, నిబంధనలు పాటించాలి’’ అని షా పేర్కొన్నారు.
ఇక, దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షా బదులిస్తూ.. నిజంగా ఎమర్జెన్సీ ఉంటే కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారన్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వన్నా కూడా తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించడాన్ని కేంద్ర మంత్రి తప్పుబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హస్తం పార్టీ మతం ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈసందర్భంగా తమిళనాడులో జరిగే ఎన్నికల్లో బిజేపీ విజయం సాధిస్తుందన్నారు.