Disha Salian Case Aditya Thakre| దిశా సాలియన్ మరణానికి సంబంధించిన కేసు విషయాలను మీడియాతో మాట్లాడేటప్పుడు తన కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరు ప్రస్తావించ వద్దని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కోరినట్లు బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే తెలిపారు. దిశా సాలియన్ మరణానికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని, అప్పట్లో రాజకీయంగా కేసును అణచివేశారని ఆరోపిస్తూ, తిరిగి దర్యాప్తు చేయించాలని కోరుతూ దిశా తండ్రి సతీశ్ సాలియన్ ఇటీవలే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ విషయంపై ఎంపీ నారాయణ్ రాణే తాజాగా మాట్లాడుతూ.. 2020లో ఒక రోజు తాను ఇంటికి వెళ్తుండగా ఉద్ధవ్ ఠాక్రే పీఏ తనను కాల్ చేశారని, ఉద్ధవ్ తనతో మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పారని వివరించారు. ఫోన్‌లో ఉద్ధవ్ తన కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరును పత్రికల్లో ప్రస్తావించకూడదని కోరారని, అయితే తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని, కేవలం ఒక మంత్రి ప్రమేయం ఉందని మాత్రమే పత్రికల్లో చెప్పానని నారాయణ్ రాణే తెలిపారు.
Also Read: జాక్ పాట్ కొట్టిన స్టేట్ – లెక్కలేనంత బంగారం గనులు గుర్తింపు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సాలియన్ మరణించిన సమయంలో ఆదిత్య ఠాక్రే మంత్రిగా ఉన్నారని, ఈ విషయం అందరికీ తెలుసని, ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఎంపీ నారాయణ్ రాణే పేర్కొన్నారు. అంతేకాకుండా, సతీశ్ సాలియన్ హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో అప్పటి మంత్రి ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. దిశా సాలియన్‌పై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేశారని, అయితే వారిని రక్షించడానికి, కేసును అణచివేయడానికి రాజకీయంగా కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. గత ఐదేళ్లుగా చాలా మంది తనపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి అక్కడే తాను మాట్లాడతానని తెలిపారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసు మూసివేస్తున్నట్లు సీబీఐ నివేదిక
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మూసివేత నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముంబై కోర్టులో దాఖలు చేసింది. రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక కేసు, సుశాంత్ కుటుంబంపై రియా చక్రవర్తి చేసి ఆరోపణలకు సంబంధించి మరో కేసు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, సుశాంత్ మరణంపై అనుమానాలకు ఎటువంటి ఆధారాలు లేవని సీబీఐ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
ముంబైలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీహార్ పోలీసులు విచారణ చేస్తున్న ఈ కేసుని ఆగస్టు 2020లో సీబీఐ హస్తగతం చేసుకుంది. దాదాపు నాలుగేళ్లపాటు విచారణ కొనసాగించిన తర్వాత, సుశాంత్ ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని సిబిఐ అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ కేసులో సీబీఐ మూసివేత నివేదిక దాఖలు చేయడంతో, సుశాంత్ మరణానికి సంబంధించిన అనేక అనుమానాలు ముగిశాయని భావిస్తున్నారు. అయితే, దిశా సాలియన్ కేసు, సుశాంత్ కేసు రెండింటిలోనూ రాజకీయ ప్రభావాలు ఉన్నాయని ఆరోపణలు కొనసాగుతున్నాయి.