PM Kisan Scheme 2025: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. గత కొద్ది నెలలుగా ఊరిస్తున్న కేంద్రం, ఎట్టకేలకు రైతన్నల కోసం కీలక ప్రకటన చేసింది. రైతన్నలకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కీం పొందే జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొనే సదుపాయాన్ని కూడా కేంద్రం కల్పించింది. ఇంతకు కేంద్రం చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏమిటి? అసలు జాబితాలో పేరు ఉందా లేదా అన్నది ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం.
రైతన్నల కోసం కేంద్రం ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతోంది. ప్రధానంగా ఏడాదికి పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ పథకం ద్వారా.. ఒక్కొక్క రైతన్నకు రూ. 6 వేలు అందజేస్తుంది. ఈ నగదును మూడు విడతలుగా రైతన్నల ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.. సాగుకు పెట్టుబడి కోసం రైతన్నలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలన్నదే. అయితే పీఎం కిసాన్ 19వ విడత నిధులను గత కొద్ది నెలలుగా విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇటీవల కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ స్కీం గురించి పీఎం మోడీ చర్చించి, సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని నిర్ణయించారు.
పీఎం నిర్ణయంతో రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీన రైతన్నల ఖాతాల్లో రూ. 2 వేలు నగదు జమ కానుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 9.7 కోట్ల మంది రైతులకు 19వ విడత నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు జాబితాను కూడా సిద్ధం చేశారు. కాగా పీఎం కిసాన్ నిధులు జమ అయ్యేందుకు రైతులు తప్పనిసరిగా ఈ కెవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈ కెవైసీ పూర్తి చేయకుంటే మీ ఖాతాలో జమ కానట్లే. ఇదే విషయాన్ని పలుమార్లు అధికారులు ప్రకటించారు.
అయితే పీఎం కిసాన్ పథకం నగదు జమ అయ్యే జాబితాలో రైతు పేరు ఉందా లేదా అన్నది తెలుసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. అందుకు సంబంధించి రైతులు https://pmkisan.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ నమోదు చేస్తే చాలు.. మీ పేరు జాబితాలో ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
మొత్తం మీద రైతులు ఎదురుచూపులకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టగా, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 24 వ తేదీన రైతన్నల మొబైల్ ఫోన్లు నగదు జమతో ట్రింగ్.. ట్రింగ్ మోగనున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా పిఎం కిసాన్ పథకం నగదు జమతో వేసవి కాలంలో మెట్ట భూముల్లో పంటలు సాగు చేసే రైతన్నలకు అధిక ప్రయోజనం చేకూరనుంది.