Nagaland Liquor: నాగాలాండ్‌లో కల్తీ మద్యం మనుషుల ప్రాణాలను బలితీసుకుంటూ పెను విషాదాన్ని నింపింది. విషపూరితమైన ఆల్కహాల్ సేవించడం వల్ల గత రెండు రోజు వ్యవధిలోనే ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఊహించని దుర్ఘటనతో బాధితుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
మోకోక్‌చుంగ్, టుయెన్‌సాంగ్‌లలో మరణాల మృదంగం
ఈ ఘోర ఘటన రాష్ట్రంలోని రెండు విభిన్న ప్రాంతాల్లో వెలుగుచూసింది. మోకోక్‌చుంగ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 8 మంది మరణించగా.. టుయెన్‌సాంగ్ జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులు మద్యం సేవించిన కొద్దిసేపటికే తీవ్రమైన అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచినట్లు తెలిసింది. నాగాలాండ్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం (డ్రై స్టేట్) ఉన్నప్పటికీ, ఇలాంటి ప్రాణాంతకమైన కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
దర్యాప్తునకు ‘సిట్’ రంగంలోకి
ఈ మరణాలకు కారణమైన విషపూరిత మద్యం మూలాలను వెలికితీసేందుకు పోలీసులు వేగంగా స్పందించారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెసుప్రా కెజో శనివారం వెల్లడించారు. ఈ ప్రత్యేక బృందానికి అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బుంగ్లాంగ్ చాంగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కల్తీ మద్యం నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారులను త్వరలోనే అరెస్టు చేస్తామని, సరఫరా మూలాలను పూర్తిగా అడ్డుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత