PM Modi Lex FridMan| అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ (PM Modi Podcast Interview) పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రజాస్వామ్యం నుంచి పాకిస్తాత్‌తో వైరం వరకు అనేక అంశాలపై ప్రధాని మాట్లాడారు. అయితే, ఈ ఎపిసోడ్‌ప్ ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ (Congress) తీవ్ర విమర్శలు చేసింది. విదేశీ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని సౌకర్యంగా కూర్చొని ఉండడాన్ని కాంగ్రెస్ ఎత్తిచూపింది.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తన ట్విట్టర్ ‘ఎక్స్’ అకౌంట్‌లో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్ కార్యక్రమంపై ఈ విధంగా విమర్శించారు. “దేశంలో మీడియాను ఎదుర్కోవడానికి భయపడే వ్యక్తి (మోదీని ఉద్దేశించి), రైట్ వింగ్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు చేసిన పాడ్‌కాస్ట్‌లో సౌకర్యంగా కూర్చొని ఉంటారు. జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన సంస్థలను విమర్శకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్న వ్యక్తి (మోదీ).. ‘విమర్శ ప్రజాస్వామ్యానికి ఆత్మ’ అని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆయన మాటలకు హద్దే లేకుండా పోయింది” అని విమర్శించారు.
Also Read: శాంతి కోసం ప్రయత్నిస్తే ఎప్పుడూ ద్రోహమే ఎదురైంది.. పాక్‌పై ప్రధాని మోదీ విమర్శలు
లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ దాదాపు మూడు గంటల పాటు మాట్లాడారు. ఈ సమయంలో.. “విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిది. నేను విమర్శలను స్వాగతిస్తాను. కానీ, అవి మరింత పదునుగా ఉండాలి. నా శక్తి పేరులో లేదు. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలోనే ఉంది. దేశమే ప్రధానమని ఆర్ఎస్ఎస్ బోధిస్తుంది. మానవ సేవే మాధవ సేవ. ఆ గొప్ప సంస్థ నుంచి ఎన్నో విలువలు నేర్చుకున్నాను. వేదాలు, స్వామి వివేకానందుడు చెప్పిన మాటలనే సంఘ్ సభ్యులకు నేర్పిస్తున్నారు” అని ప్రధాని మోదీ తెలిపారు.
మోదీ కార్యక్రమానికి ముందు రెండు రోజులు ఉపవాసం
అమెరికన్ పరిశోధకుడు ఫ్రిడ్‌మ్యాన్ గాయత్రీ మంత్రాన్ని జపించగా, ప్రధాని మోదీ ఆయనను మెచ్చుకున్నారు. పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ చివరలో ఫ్రిడ్‌మ్యాన్, “హిందూ ప్రార్థన లేదా ధ్యానంతో కొన్ని క్షణాలు మీరు నాకు మార్గదర్శకత్వం వహించగలరా? గాయత్రీ మంత్రాన్ని (Gayatri Mantra) నేర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు దీన్ని జపించేందుకు ప్రయత్నించాను. ఈ మంత్రం విశిష్టత, జీవితంలో ఆధ్యాత్మికత ప్రాముఖ్యత గురించి మీరు వివరిస్తారా? ఇప్పుడు నేను గాయత్రీ మంత్రాన్ని పఠించేందుకు ప్రయత్నించనా?” అని ప్రధానిని కోరారు.
దీనికి ప్రధాని మోదీ సమ్మతించడంతో.. ఫ్రిడ్‌మ్యాన్ గాయత్రీ మంత్రాన్ని జపించి, “ఎలా పఠించాను? అంతా సరిగ్గా చెప్పానా?” అని అడిగారు. దీనికి ప్రధాని బదులిస్తూ, “చాలా గొప్పగా చెప్పారు. ఈ మంత్రం సూర్యుడి ప్రకాశవంతమైన శక్తికి అంకితం. ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి శక్తిమంతమైన సాధనగా దీన్ని పరిగణిస్తారు” అని ఫ్రిడ్‌మ్యాన్ ప్రయత్నాన్ని ప్రశంసించారు.
ఈ పాడ్‌కాస్ట్‌కు ముందు తాను 45 గంటల పాటు ఉపవాసం చేశానని ఫ్రిడ్‌మ్యాన్ చెప్పారు. ప్రధానితో చర్చకు గౌరవ సూచకంగా కేవలం నీరు మాత్రమే తీసుకున్నానని, ఎలాంటి ఆహారం ముట్టుకోలేదన్నారు. ఆధ్యాత్మిక స్థాయిని చేరుకోవడం కోసమే ఉపవాసం ఉన్నానని ఆయన తెలిపారు. దీంతో ప్రధాని మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “నాపై గౌరవంతో మీరు ఉపవాసం చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వేంద్రియాలను పదును పెట్టడం, మానసిక స్థిరత్వం, క్రమశిక్షణను పెంపొందించేందుకు ఉపవాసం ఎంతగానో ఉపయోగపడుతుంది” అని మోదీ తెలిపారు.