Cyclone Fengal Updates: ఫెయింజల్ తుపాను బలహీన పడి తీవ్ర వాయు గుండంగా మారింది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిని అనుకున్న ఉంది ఈ తుఫాన్. దీని కారణంగా రానున్న రెండురోజుల్లో ఏపీ, తెలంగాణలో తేలిపాకటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
సోమవారం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరంలో గంటలకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.
ఇక తెలంగాణకు వస్తే.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. వాటిలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలు ఉన్నాయి.
ఫెయింజల్ దెబ్బకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో వేలాది ఎకరాల పంట దెబ్బతింది. చాలా చోట్ల బలమైన గాలులకు వరి నేల వాలింది. కమర్షియల్ పంటలైన వేరు శెనగ, మినుము, పెసలు, కంది, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.
ALSO READ: బంగ్లాదేశ్ లో మరో ఇద్దరు ఇస్కాన్ సన్యాసుల అరెస్ట్!
కడప, చిత్తూరు జిల్లాల్లో అరటి, పూలతోటలు, కూరగాయలపై తీవ్ర ప్రభావం చూపింది. వర్షాల ధాటికి తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రూట్లో పలు చోట్ల కొండ చరియలు జారిపడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. రాకపోకలు యధావిధిగా పునరుద్ధరించారు. తిరుమలలో పార్కింగ్ ప్రదేశాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో తుఫాను తగ్గుముఖం పట్టడంతో కొన్ని ప్రాంతాల్లో సాధారణ స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదు అవుతున్నాయి. 15 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మెదక్ – 15.8 డిగ్రీలు, ఆదిలాబాద్- 19.7, హయత్ నగర్- 20 డిగ్రీలు, పఠాన్ చెరు- 20.4 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఇక తమిళనాడు విషయానికొస్తే.. విళ్లుపురం జిల్లాలో ఏకంగా 51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి భారీ వర్షాల్ని చవి చూసింది. కడలూరు, తిరువణ్ణామలై, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్షించారు. ఆయా జిల్లాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రులు, కలెక్టర్లులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు.
ఆదివారం సైతం మూడు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాటిలో విళ్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు జిల్లాలు ఉన్నాయి. పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్ కంటిన్యూ చేశారు. మరోవైపు వరద బాధితులకు సాయం అందజేసే కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.
తుఫాను కారణంగా తమిళనాడు నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగించారు. నాగర్ కోయిల్ – తాంబర్ విక్లీ ట్రైన్, తిరునెల్వేలి- ఎగ్మూరు, తాంబరం- రామనాథపురం రైళ్లను పొడిగించిన వాటిలో ఉన్నాయి.
చెన్నైలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో విమానాశ్రయంలో సేవలు మొదలయ్యాయి. తొలుత ఆదివారం రాత్రి ఏడు గంటలకు సేవలు మొదలుపెట్టాలని భావించినప్పటికీ సాధ్యం కాలేదు. అర్థరాత్రి నుంచి విమాన సర్వీసులు మొదలుపెట్టినట్టు అధికారులు వెల్లడించారు.