Daring Nurse Jhansi Hospital| హీరోలంటే ఎవరో కాదు.. కష్టాలను ఎదురించి నిలబడే వారు. ప్రమాద సమయంలో ధైర్యంగా నిర్భయంగా ముందడుగు వేసేవారు. దేశ సరిహద్దులను కాపాడే సైనికులు, సమాజంలో దుష్టులతో నిజాయితీగా పోరాడే పోలీసులు కూడా హీరోలే. వీరితోపాటు ప్రమాద సమయంలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఇతరులను కాపాడే ప్రతి ఒక్కరూ మన సమాజానికి ఆదర్శం. తాజాగా ఆస్పత్రిలో పనిచేసే నర్సు ఇలాంటి ధైర్యం చూపించింది. తన ప్రాణాలు ఫణంగా పెట్టి 10 మంది పిల్లలను కాపాడింది. కొన్ని రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ నర్సు పెద్ద సాహసమే చేసింది.
ఝాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆస్పత్రిలో మేఘా జేమ్స్ అనే నర్సు పనిచేస్తోంది. అయితే ఆస్పత్రిలో శుక్రవారం నవంబర్ 15 2024న పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది పసికందులు చనిపోయారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నర్సు మేఘా జేమ్స్ డ్యూటీలో ఉంది. జాతీయ మీడియాతో నర్సు మేఘా ప్రమాదం గురించి మాట్లాడింది.
ఆమె ఆ రోజు రాత్రి తన కళ్లెదుటే జరిగిన ప్రమాదాన్ని వివరించింది. అగ్నిప్రమాదం చాలా భయంకరంగా జరిగిందని నర్సు మేఘా చెప్పింది.
“శుక్రవారం రాత్రి నేను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ (పసికందుల ఐసియు) వార్డులో డ్యూటీ చేస్తున్నాను. వార్డులోపల మొత్తం 11 బెడ్స్ ఉన్నాయి. అయితే 11 బెడ్స్ పై మొత్తం 24 పసిబిడ్డలున్నారు. నేను ఒక బిడ్డకు ఇంజెక్షన్ ఇవ్వాలని గమనించి వార్డు నుంచి బయటకు వెళ్లాను. ఇంజెక్షన్, సిరంజి తీసుకొని తిరిగి వచ్చేసరికి ఒక ఆక్సిజన్ కాన్సట్రేటర్ నుంచి మంటల రావడం గమనించాను. వెంటనే వార్డు బాయ్ ని పిలిచి ఫైర్ ఎక్స్‌ట్వింగిషర్ (అగ్నిమాపక సిలిండర్) తీసుకురావాలని చెప్పారు. అతను అగ్నిమాపక సిలిండర్ తీసుకొని వచ్చేసరికి మంటలు వార్డులో ఇంకా వ్యాపించాయి.
Also Read: మునిగిపోతున్న ఫ్రెండ్‌ను కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు యువతులు.. ముగ్గురూ మృతి!
దీంతో మిగతా ఆస్పత్రి సిబ్బందిని కూడా సాయం కోసం పిలిచాను. ఆ సమయంలో నాకు ఏం చేయాలో తోచలేదు. వెంటనే లోపలికి వెళ్లి పిల్లలను బయటకు తీసుకురావాలని అందరికీ చెప్పాను. ముందుగా నేనే లోపలికి వెళ్లాను ఒక బిడ్డను లోపలి నుంచి తీసుకొచ్చేలోపే నా సల్వార్ (మహిళలు ధరించే పంజాబి డ్రెస్ ప్యాంటు) కు నిప్పంటుకుంది. నేను వేసుకున్న చెప్పులు కూడా కాలిపోయాయి. దీంతో చెప్పులు పారేసి వెంటనే సల్వార్ విప్పేశాను. వేరే సల్వార్ వేసుకొని వెంటనే తిరిగి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాను కానీ మంటలు భారీ స్థాయిలో ఎగిసి పడుతున్నాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది నన్ను లోపలికి వెళ్లవద్దని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా నేను వార్డులోకి వెళ్లి కొంతమంది పిల్లలను బయటికి తీసుకొని వచ్చాను.
కానీ అప్పుడే అసలు సమస్య మొదలైంది. ఆస్పత్రిలో కరెంటు పోయింది. మొత్తం పొగ వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో దాదాపు 14 మంది పసికందులను మాత్రమే కాపాడగలిగాను. నా బట్టలన్నీ కాలిపోయాయి.” అని చెప్పింది.
Also Read: పిల్లాడిని వెంటబెట్టుకొని జొమాటో డెలివరీ.. మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు
ఈ అగ్నిప్రమాదంలో నర్సు మేఘా ఒక్కరే 10 మంది పిల్లల ప్రాణాలు కాపాడారు. కానీ ఆ ప్రయత్నంలో ఆమె శరీరం కాలిపోయింది. ప్రస్తుతం ఆమె అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నర్సు మేఘా జేమ్ తో పాటు పిల్లలను కాపాడేందుకు అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ నలినీ సూద్ కూడా ప్రయత్నించారు. ఆమెకు కూడా అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. నర్సు మేఘా ఆకాశ్ తన ప్రాణాలకు తెగించి సాహసం చేసిందని ఆమె ధైర్యన్ని మెచ్చుకున్నారు.