Haryana Congress Worker Murder Himani Narwal| హర్యాణా రాష్ట్రంలో శనివారం రాత్రి ఒక సూట్ కేసులో ఒక మృతదేహం లభించింది. అది ఒక మహిళ మృతదేహం. ఆమె మరెవరో కాదు హర్యాణా కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త హిమానీ నార్వాల్. ఈ హత్యకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ దారుణ ఘటనలో పాల్గొన్న వారికి కఠినమైన శిక్ష విధించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ ఈ కేసు పై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక విచారణ బృందం (SIT) ఏర్పాటు చేసి ఈ హత్య కేసు విచారణ చేయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. ఈ మేరకు హర్యాణా కాంగ్రెస్ ఎంఎల్ఏ భరత్ భూషణ్ బట్టా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. హిమానా నర్వాల్‌ను కిరాతకంగా హత్య చేసిన వారికి కఠినమైన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
హత్య వివరాలు..
హర్యాణాలోని రోహతక్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. హర్యాణా కాంగ్రెస్ లోని మహిళా వింగ్ నేత హిమానీ నార్వాల్ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. నర్వాల్‌ను హత్య చేసిన తర్వాత.. ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు. రోహతక్ జిల్లా.. సప్లా బస్‌స్టాండ్ దగ్గర సూట్‌కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం కనుగొనడంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్‌స్టాండ్ వద్ద సూట్‌కేసు పడి ఉండటంతో దాన్ని తెరిచి చూసినప్పుడు ఈ దారుణ ఘటన బయటపడింది. హిమానీ మెడపై గాయాలు ఉండటం ఈ ఘటన హత్య అనడానికి మరింత బలం చేకూర్చుతోంది.
Also Read: మహిళలు చేసే లైంగిక ఆరోపణలన్నీ నిజం కాదు.. తప్పుడు ఫిర్యాదులు చేస్తే కఠిన చర్యలు
రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో హిమానీ నర్వాల్
ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన భారత్ జోడో యాత్రలో హిమానీ నార్వాల్ చురుకుగా పాల్గొన్నారు. సోనీపత్ లోని కతారా గ్రామానికి చెందిన హిమానీ నార్వాల్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి ర్యాలీలోనూ ఉత్సాహంగా పాల్గొనేవారు. పార్టీ చేపట్టే సామాజిక కార్యక్రమాలలో కూడా ఆమె చురుకుగా పాల్గొని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య
హర్యాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా ఈ ఘటనపై ప్రతిస్పందిస్తూ, “మేము ఒక మంచి కార్యకర్తను కోల్పోయాము” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందని, పరిస్థితులు దిగజారిపోయాయని ఈ హత్య ఘటన నిరూపించిందని ఆయన అన్నారు. ఈ కేసు పై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరపకపోతే నిందితులు బయటకు రారని ఆయన హెచ్చరించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని భూపేందర్ సింగ్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా శిక్షలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఈ హత్య ఘటన ద్వారా తెలుస్తుందని భూపేందర్ సింగ్ విమర్శించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) రికార్డులను పరిశీలిస్తే, రాష్ట్రంలో నేరాలు ఎలా పెరుగుతున్నాయో తెలుస్తుందని ఆయన అన్నారు. ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపింగ్‌లు, దొంగతనాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.