Sudha Murthy Work Week| ఆఫీసులో ఉద్యోగులు ఎక్కువ పనిగంటలు చేయాలని కొందరు ప్రముఖలు చేసిన వ్యాఖ్యలు గత కొన్ని నెలలుగా వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మెన్ సుబ్రమణియన్ ఈ విధంగా మాట్లాడారు. అయితే వారానికి 70 గంటలు పని చేయాలని వ్యాఖ్యానించిన నారాయణమూర్తి ఈ కోవలో ప్రథముడు. ఈ వివాదంపై రాజ్యసభ సభ్యురాలు ఆయన సతీమణి సుధామూర్తి “ఇండియా త్రూ ది ఐస్ ఆఫ్ ఇట్స్ ఐకాన్స్” కార్యక్రమంలో స్పందించారు.
“ఏ పనినైనా అంకితభావంతో చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, సమయం అనేది పరిమితం కాదని ఆమె వివరించారు. నారాయణమూర్తి డబ్బు లేకుండా, అంకితభావంతో పనిచేసే సహోద్యోగులతో ఇన్ఫోసిస్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వారందరూ వారానికి 70 గంటలు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం పనిచేసినప్పుడే ఇన్ఫోసిస్ ఈ స్థాయికి వచ్చింది. పని గంటలను లెక్కించుకుంటే, ఇన్ఫోసిస్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు.
ఇన్ఫోసిస్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే, దీని వెనుక ఏ మాయా మంత్రాలు లేవు. కేవలం పూర్తి అంకితభావంతో కష్టపడి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. అదృష్టం, సరైన సమయం, సరైన స్థలం వంటి అంశాలు కూడా ఇన్ఫోసిస్ ఎదగడానికి తోడ్పడ్డాయి,” అని సుధామూర్తి పేర్కొన్నారు.
Also Read: జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. ఆయనకు కొత్తేం కాదు ఇంతకుముందు కూడా
నారాయణమూర్తి మాత్రమే కాదు, కొందరు పత్రికా ప్రతినిధులు, వైద్యులు, ఇతర రంగాల వారు కూడా వారానికి 90 గంటలు పనిచేస్తున్నారని ఆమె వివరించారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్‌లో బిజీగా ఉన్నప్పుడు, తాను ఇంటి పని, పిల్లల సంరక్షణలో సమయం గడిపానని.. అదే సమయంలో, కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బోధించడం కూడా ప్రారంభించానని సుధామూర్తి తెలిపారు.
ఏ పనినైనా చేయాలనుకున్నప్పుడు, “నాకు సమయం లేదు” అని అనుకోకూడదు. పని చేస్తున్నప్పుడు దానిని ఆస్వాదించాలని ఆమె అన్నారు. అందువల్ల, తాను ఎప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తూ బిజీగా ఉంటానని చెప్పారు. ఆమె పిల్లలు విదేశాలకు వెళ్ళినప్పుడు, తాను ఓవర్ టైమ్ పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె తన భర్త కంటే ఎక్కువ బిజీగా ఉన్నారని, దీనికి నారాయణమూర్తి కూడా మద్దతు ఇస్తున్నారని ఆమె తెలిపారు.
ప్రతి విజయవంతమైన మహిళ వెనుక, ఆమెను అర్థం చేసుకునే పురుషుడు ఉంటాడు. నారాయణమూర్తి పనిచేస్తున్నప్పుడు ఆమె ఆయనకు మద్దతు ఇచ్చారు. అదే విధంగా, ఆమె పనిచేస్తున్నప్పుడు నారాయణమూర్తి ఆమెకు అండగా నిలబడతారని చెప్పారు. జీవితమంటే ఇదేనని వ్యాఖ్యానించారు. ధనవంతులకైనా, పేదవారికైనా, అందమైనవారికైనా, వికారంగా ఉన్నవారికైనా , అందరికీ దేవుడు రోజుకు 24 గంటలే ఇచ్చాడని ఆమె వివరించారు. ఆ సమయాన్ని ఎలా ఖర్చు చేయాలనేది పూర్తిగా వ్యక్తి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మీరు చేసే పనిపై ఆసక్తి ఉంటే, మీ జీవిత భాగస్వామి కూడా దానికి తప్పకుండా మద్దతు ఇస్తారని సుధామూర్తి అన్నారు.