Jagdeep Dhankhar Kapil Sibal| ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ న్యాయ వ్యవస్థపై చేసిన విమర్శలకు రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని, సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించకూడదని ధన్‌ఖడ్ వ్యాఖ్యానించడంపై సిబాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి శాఖకు నిర్దేశించిన విధులను సరిగా నిర్వర్తించకపోతే, న్యాయవ్యవస్థ జోక్యం చేయడం తప్పదు అని స్పష్టం చేశారు.
శుక్రవారం మీడియా సమావేశంలో కపిల్ సిబాల్ మాట్లాడుతూ.. ‘‘కార్యనిర్వాహక శాఖ తగిన విధంగా తన బాధ్యతలు నిర్వహించకపోతే, న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం అనివార్యం. ఇది న్యాయవ్యవస్థకు కల్పించబడిన స్వతంత్ర హక్కు. ప్రజాస్వామ్యంలో ఇది మౌలికత. న్యాయవ్యవస్థ ఒక స్వతంత్ర శక్తిగా పనిచేస్తుంది’’ అని పేర్కొన్నారు.
ఇక ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై సమాధానమిస్తూ.. ‘‘ఉప రాష్ట్రపతి మాటలు నన్ను ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ రోజుల్లో ప్రజలు ఏదైనా ఒక వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకుంటున్నారంటే అది న్యాయవ్యవస్థపైనే. మన రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రపతి పెద్దగా పాత్ర పోషించరు. ఆ పదవి నామమాత్రంగా మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతి కేవలం కేంద్ర క్యాబినెట్ సలహాల ప్రకారం పనిచేస్తారు. ఆ పదవిలో ఉన్నవారికి వ్యక్తిగతంగా ఎలాంటి అధికారాలు లేవు’’ అని సిబాల్ స్పష్టం చేశారు.
ధన్‌ఖడ్ ఏమన్నారు?
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గురువారం ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. న్యాయవ్యవస్థ రాష్రపతికి ఆదేశించమేంటని ప్రశ్నించారు. రాష్ట్రపతిని న్యాయవ్యవస్థ ఆదేశించలేదని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు పార్లమెంట్‌ను మించిన శక్తిగా మారాలని ప్రయత్నించడం సరైన పంథా కాదన్నారు. రాష్ట్ర గవర్నర్లు పరిశీలన కోసం పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సిన గడువును సుప్రీంకోర్టు నిర్దేశించిన విషయం పట్ల ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన పరిణామమని అన్నారు. ‘‘ఇలాంటి వ్యవస్థ కోసం మనం ప్రజాస్వామ్యాన్ని నిర్మించలేదు. సుప్రీంకోర్టుకు ఆదేశాలు ఇచ్చే అధికారం ఎక్కడ ఉంది? శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు చేయాల్సిన పనులను న్యాయవ్యవస్థ చేయడం ఏంటీ? మనం ఎటు పోతున్నాం? దేశంలో ఇది ఏమి జరుగుతోంది?’’ అంటూ ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన ఒక తీర్పుని తప్పుబట్టారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: ‘మాంసాహారం తినే వారు రోత’.. మరాఠీలతో గొడవ పడిన గుజరాతీలు
సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అమోదించిన బిల్లులను గవర్నర్ ఆరు నెలలకు పైగా ఆమోదించడం లేదని.. కొన్ని రాష్ట్రపతి వద్ద కూడా పెండింగ్ లో ఉన్నాయని ఇలా చేస్తే ప్రజా సమస్యలు, సంక్షేమం కోసం చేసిన కొత్త చట్టాలు కార్యరూపం ఎలా దాలుస్తాయని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ పిటీషన్ విచారణ చేసిన అత్యున్నత న్యాయ స్థానం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ లేదా రాష్ట్రపతి మూడు నెలల్లోగా ఆమోదించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం