DK Shiva Kumar Siddharamaiah Corrupt says BJP| కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్.. శివరాత్రి సందర్భంగా ఇటీవల కోయంబత్తూరులో సద్గురు (జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంఘటన జాతీయ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ లో తీవ్ర చర్చలకు కారణమైంది.
కాంగ్రెస్ నేతలు కొందరు ఇప్పటికే డీకే శివకుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో డీకె శివకుమార్ బీజేపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారనే వాదన కూడా వినిపించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరైనందున ఈ వాదనకు మరింత బలం చేకూరింది.
ఇదిలా ఉంటే.. తాజాగా కర్ణాటక బీజేపీ నాయకులు.. డీకే శివకుమార్ మరో మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే కానున్నారని వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ లో మరింత అలజడి రేగింది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏక్ నాథ్ షిండే సహకరించిన విషయాన్ని కర్ణాటక బిజేపీ నేత ఆర్ అశోక్ ప్రస్తావించారు. అదే విధంగా డీకే శివకుమార్ కూడా కాంగ్రెస్ ను చీల్చుతారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉన్న డీకే ఆ పార్టీని కూల్చడం జరుగుతుందని వ్యాఖ్యానించారు.
Also Read: భారత్‌లో మధ్యతరగతి ఆదాయం పెరగడం లేదు.. 50 ఏళ్ల కనిష్టానికి పొదుపు!
దీనిపై డీకే శివకుమార్ స్పందించారు. ఇది బీజేపీ గేమ్ ప్లాన్ అని ఆయన మండిపడ్డారు. తాను కాంగ్రెస్ వాదినని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడనని స్పష్టం చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని డీకే పేర్కొన్నారు.
సిద్ధరామయ్యపై ‘శీష్ మహల్’ తరహా అవినీతి ఆరోపణలు
ఇప్పటికే ముడా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన అధికారిక నివాసాన్ని ‘శీష్ మహల్’ తరహాలో పునరుద్ధరించడానికి ప్రజాపనుల విభాగం దాదాపు రూ.2.6 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం వద్ద నిధులు లేవని పేర్కొంటూ, మరోవైపు అధికారులు అనవసర ఖర్చులు చేస్తున్నారని బిజేపీ ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్ విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన మిగతా పనులు పూర్తిచేసిన తర్వాత ముఖ్యమంత్రి తన సొంత పనులు చేసుకోవడంపై దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ నిధులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం వాటిని ఇతర ప్రయోజనాలకు మరలిస్తుందని అన్నారు.
ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అధికారిక భవనం పునరుద్ధరణలో భాగంగా రూ.1.7 కోట్లను హెల్పర్ రూమ్‌లు, ఇతర నిర్మాణాలకు కేటాయించగా, రూ.89 లక్షలను ఎలక్ట్రికల్ అప్‌గ్రేడ్, ఎయిర్ కండిషనింగ్ మొదలైన సదుపాయాల కోసం వినియోగించినట్లు ఆర్థికశాఖ నుంచి నివేదికలు వెలువడడంతో ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతి, బావమరిదిపై కేసులు నమోదు కావడంతో ఎస్‌పీ టి.జె.ఉదేశ్ నేతృత్వంలో లోకాయుక్త విచారణ ప్రారంభించింది. ఇటీవలే విచారణ పూర్తి చేసిన లోకాయుక్త పోలీసులు సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘సీఎం బంగ్లా’ వివాదం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘సీఎం బంగ్లా’ వివాదం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ బంగ్లాను ‘శీష్ మహల్’ (అద్దాల మేడ) అని బిజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన తన ఇంటిని 7-స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని బిజేపీ విమర్శలు చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆప్ మోసాలకు ఆ మహల్ ఓ ఉదాహరణ అని బిజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలతో పాటు ‘శీష్ మహల్’ విమర్శలు కూడా ఆ పార్టీ ఓటమిలో కీలకంగా మారాయి.