Grandmother Murder: కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వృద్దురాలిని స్వయానా మనుమరాలు తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. చదువును పక్కనపెట్టి ఓ యువకుడితో తిరుగుతోందని మందలించినందుకు ఈ దారుణానికి ఒడిగట్టింది. కృష్ణరాజపేట (కేఆర్ పేట) తాలూకా పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మృతురాలైన 52 ఏళ్ల మహదేవమ్మ.. తన మనుమరాలిని దగ్గరుండి పెంచి పెద్ద చేశారు. అయితే ఆ మనుమరాలు చదువుపై దృష్టి పెట్టకుండా, ఆకాశ్ (23) అనే యువకుడితో చనువుగా తిరుగుతుండటాన్ని మహదేవమ్మ గమనించారు. వారి సన్నిహిత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అనవసరమైన విషయాలు మానుకుని చక్కగా చదువుకోవాలని మనుమరాలికి హితవు పలికారు.
అయితే తన ప్రేమకు, స్వేచ్ఛకు పదే పదే అడ్డు వస్తోందన్న కక్షతో ఆ మనుమరాలు దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన ప్రియుడు ఆకాశ్ ను ఇంటికి రప్పించుకుంది. ఆ తర్వాత గాఢ నిద్రలో ఉన్న నానమ్మ మహదేవమ్మ గొంతుకు తాడు బిగించి ఇద్దరూ కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
Also Read: రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!
మహదేవమ్మ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె మేనల్లుడు కేఆర్ పేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆకాశ్ ను అరెస్ట్ చేశారు. మరోవైపు నేరానికి పాల్పడిన మైనర్ బాలికను తదుపరి చర్యల నిమిత్తం బాల నేరస్తుల పునరావాస కేంద్రంకు తరలించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!