Kejriwal Election Commission Bribe | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘం (EC) పనితీరుపై సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందు ఎన్నికల సంఘం లొంగిపోయిందని ఆరోపించారు. స్వతంత్ర సంస్థగా ఎన్నికల సంఘం తన ఉనికిని పూర్తిగా కోల్పోయిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ నెలాఖరుకు రిటైర్ అయ్యే ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు బిజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందని ప్రశ్నించారు. ‘‘గవర్నర్ పదవినో లేదా రాష్ట్రపతి పదవినో ఇస్తామని బిజేపీ ఆయనకు హామీ ఇచ్చి ఉంటుంది. అందుకే పదవీకాంక్షతో దేశ ప్రజాస్వామ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఇకనైనా వ్యక్తిగత ప్రయోజనాలను వదిలి, చివరి కొద్ది రోజులైనా సీఈసీ తన విధులను న్యాయబద్ధంగా నిర్వర్తించాలని కేజ్రీవాల్ కోరారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా బిజేపీ గూండాలు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవడానికి ఢిల్లీ పోలీసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఒకవైపు తాము ఢిల్లీ ప్రజల అభివృద్ధికి పాటుపడుతూ నెలకు రూ.25,000 ఆదా చేస్తుంటే, మరోవైపు ఇతర పార్టీలు దేశ రాజధానికి సమస్యలు సృష్టించడానికి కుట్రలు చేస్తున్నాయని కేజ్రీవాల్ మండిపడ్డారు.
Also Read: ఆప్ కార్యకర్తలపై దాడులు.. బిజేపీపై గుండాయిజం ఆరోపణలు చేసిన కేజ్రీవాల్
ఢిల్లీలో ఉచితాల పోరు
ప్రస్తుతం దేశంలో రాజకీయాలు ఉచితాల చుట్టూనే తిరుగుతున్నాయి. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో ఉచితాలకు ఓట్లు రావడంతో ఢిల్లీలో కూడా పార్టీలు ఉచితాలను ప్రకటించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత విద్యుత్, తాగునీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సదుపాయాలతో రెండుసార్లు విజయం సాధించింది. ఈసారి మహిళలకు నెలకు రూ.2,100 చొప్పున ఇస్తామని ప్రకటించింది. బిజేపీ కూడా ఉచిత వరాలను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా ఉచితాలను కుమ్మరించింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి సవాళ్లు
అవినీతి వ్యతిరేక పునాదులపై పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయింది. ఢిల్లీలో పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన చర్యలతో ప్రజల మన్ననలు పొందింది. కానీ కలుషిత నీరు, దారుణమైన రోడ్ల పట్ల ప్రజలలో అసంతృప్తి ఉంది. పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ వల్ల ఓట్లు చీలిపోతాయన్న ఆందోళన ఆమ్ ఆద్మీ పార్టీలో కనిపిస్తోంది. అందుకే బిజేపీకి కాంగ్రెస్ సాయం చేస్తోందని కేజ్రీవాల్ ఆరోెపణలు చేశారు.
కాంగ్రెస్‌ది అస్తిత్వ పోరాటం
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన కాంగ్రెస్ ఈసారి ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, బిజేపీల మధ్య పోరులో కాంగ్రెస్ చతికలపడింది. దళితులు, మైనారిటీల ఓట్లను తిరిగి సంపాదించేందుకు కాంగ్రెస్ నాయకులు కష్టపడుతున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ అప్పుడప్పుడు కేజ్రీవాల్ కు చురకలంటిస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో బిజేపీ ఫుల్ ఫోర్స్
1998 నుంచి ఢిల్లీలో అధికారంలో లేకపోవడంతో ఈసారి ఎలాగైనా పట్టు సాధించడానికి బిజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉన్న ఝుగ్గీ క్లస్టర్లు, అనధికార కాలనీలపై బిజేపీ దృష్టి సారించింది. సంఘ్ పరివార్‌తోపాటు అనుబంధ సంఘాలతో ఈ ప్రాంతాల్లో ప్రచారం చేస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి బిజేపీ బాగా పుంజుకున్నా, కేజ్రీవాల్‌ను ఢీకొట్టగలిగే నేత లేకపోవడం ఇబ్బందిగా మారింది.
మధ్యతరగతి ప్రజలు కీలకం
ఢిల్లీలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. 67 శాతం మంది వారే. బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పెంచడం ద్వారా బిజేపీ మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంది. ఇది కేజ్రీవాల్‌కు భారీ షాక్‌గా మారింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఫిబ్రవరి 5న పోలింగ్
ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించబడతాయి. రెండుసార్లు గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ ఢిల్లీలో కూడా అధికారం సాధించాలని ఆశిస్తోంది. కాంగ్రెస్ కూడా ఢిల్లీలో తన ఉనికిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజల నుంచి ఎంత మద్దతు లభిస్తుందన్నది చూడాల్సిన అంశమే!