Kidnapped Forced Marriage | మహిళలను అపహరించి.. బలవంతంగా వివాహాలు చేసినట్లు చరిత్రలో చాలా ఉదాహరణలున్నాయి. కానీ పురుషులను కిడ్నాప్ చేసి తలకు తుపాకీ గురిపెట్టి వారి చేత తాళి కట్టించడం కూడా మన దేశంలో జరుగుతోంది. తాజాగా ఒక ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసే వ్యక్తిని కొంతమంది ఎత్తుకుపోయారు. ఆ తరువాత అతడిని ఒక యువతితో బలవంతంగా వివాహం చేశారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అవినాష్ కుమార్ (30) అనే యువకుడు ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. చాలా కాలంగా బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) పరీక్షల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే బిపిఎస్‌సి పరీక్షలు రాసి అర్హత సాధించాడు. త్వరలోనే అతనికి ఉన్నత ఉద్యోగం ఖాయం. అంత మంచి భవిష్యత్తు ఉన్న అవినాష్ కుమార్ గత శుక్రవారం ఉదయం యథావిధిగా ఆటోలో స్కూల్ కెళుతుండగా.. మార్గం మధ్యలో రెండు స్కార్పియో కార్లు వచ్చి అడ్డగించాయి. అందులో నుంచి 10 మందికి పైగా యువకులు తుపాకులు పట్టుకొని కింది దిగారు. వారంతా ఆటో డ్రైవర్‌ని కొట్టి అవినాష్ తలపై తుపాకీ గురిపెట్టి తమతో రావాలని చెప్పారు.
Also Read: భార్య పిల్లలను వదిలి ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. 3 నెలల తరువాత ప్రియురాలితో
తుపాకులు చూసి భయపడి పోయిన అవినాష్ వారితో పాటు వెళ్లారు. వారందరూ అవినాష్ ను ఒక ఇంటికి తీసుకెళ్లి.. అక్కడ ఎదురుగా ఒక యువతి నిలబడి ఉంది. ఆమె పేరు గుంజన్. గత కొన్ని సంవత్సరాలుగా అవినాష్‌ని గుంజన్ ప్రేమిస్తోంది. దీంతో అతడినే పెళ్లిచేసుకోవాలని తన మనషుల చేత కిడ్నాప్ చేసింది. అవినాష్ ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో గుంజన్ మనుషులు అతడిని బాగా కొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేక అవినాష్ ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చింది.
ఇలాంటి వివాహాలు బిహార్‌లో జరగడం కొత్తేమీ కాదు. పకడ్వా వివాహ్ (బంధించి వివాహం చేయడం) పేరుతో ఈ సంప్రదాయం అక్కడ ఉంది. ఈ సంప్రదాయం ప్రకారం.. ఆర్థిక స్థిరంగా ఉన్న ఒక యువకుడిని కొట్టి చితకబాది.. అతడిని కిడ్నాప్ చేసి అతడికి ఇష్టం లేకోపోయినా మరో యువతితో వివాహం చేస్తారు. ఈ సంప్రదాయం బీహార్ లో గత 30 సంవత్సరాలుగా ఉంది. అయితే 2024 సంవత్సరంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. గతంలో పేద, మధ్య తరగతికి చెందిన యువతి తల్లిదండ్రులు ఆమెకు వరకట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో వారి కులానికి చెందిన వారంతా ఏకమై ఆమెకు వివాహం చేయడానికి మంచి ఆదాయం ఉన్న యువకుడిని వెతికి అతడిని అపహరించి వివాహం చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని తరగతుల వారు చేస్తున్నారని సమాచారం.
పెళ్లి తరువాత పారిపోయిన వరుడు
బిహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన సుధాకర్ రాయ్ కుమారుడు అవినాష్ కుమార్‌ని లాఖిసరాయ్ జిల్లా గుంజన్ అనే యువతి కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తరువాత గుంజన్ తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లగానే అక్కడ గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో అవినాష్ అక్కడి నుంచి పారిపోయాడు.
గుంజన్ వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నాలుగేళ్లుగా అవినాష్ తనను ప్రేమించాడని, కానీ ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని.. అందువల్లే బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఫిర్యాదు లో పేర్కొంది. మరోవైపు అవినాష్ కూడా పోలీసులను సంప్రదించాడు. తాను ఎప్పుడూ గుంజన్ ని ప్రేమించలేదని.. ఆమె తన వెంట పడేదని తెలిపాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించేదని కానీ తనకు గుంజన్ అంటే ఇష్టం లేదని ఆమె తనను కిడ్నాప్ (bihar kidnap marriage) చేసినందుకు, రౌడీలతో కొట్టించినందుకు కేసు పెట్టాడు.