Relief to Karnataka CM : కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన మైసూరు అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) భూముల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యలుకు భారీ ఊరట దక్కింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లుగా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబ సభ్యులకు ప్లాట్లు కేటాయించినట్లుగా వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు.. తమ విచారణ తుది నివేదికను ఆ రాష్ట్ర హైకోర్టుకు సమర్పించారు
ఒకానొక దశలో ఈ కేసులోని ఆరోపణలతోనే సీఎం పీఠానికి దూరంగా ఉండాల్సి వస్తుందన్న ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. ఎన్నికల్లోనూ ఈ అంశమై ప్రత్యర్థులకు ప్రచారాస్త్రం అయ్యింది. అలా.. ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇరకాటంలో పెట్టిన ఈ కేసులో ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు తేల్చడంతో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లైంది. ఈ కేసులో సిద్ధరామయ్యతో పాటుగా ఆయన సతీమణి పార్వతి, ఆమె సొదరుడు, మరొక వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు రాగా, కేసులు నమోదయ్యాయి. కాగా.. ఈ కేసును కర్ణాటక లోకాయుక్తా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు విషయమై.. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో కేసులో ఆధారాలు లభించలేదని, అదే విషయాన్ని హైకోర్టుకు నివేదించినట్లుగా తెలుపుతూ.. లేఖ రాశారు. ఈ నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించిన పోలీసులు, అందుకు వారం రోజుల పాటు గడుపు ఇస్తున్నట్లుగా తెలిపారు.
మైసూరు అర్భన డెవలప్మెంట్ బోర్డు పరిధిలో సీఎం తన అధికారాల్ని దుర్వినియోగం చేస్తూ.. ఆయన సతీమణి పార్వతీ సిద్ధరామయ్య పేరుపై 14 ఇళ్ల ప్లాట్లు కేటాయించారంటూ ఆరోపణలు వచ్చాయి. సామాజిక కార్యకర్త టీ.జే అబ్రహాం ఈ విషయాన్ని తొలుత వెలుగు లోకి తీసుకువచ్చారు. అప్పటికే.. సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఈ ఆరోపణలతో ఇబ్బందులు పడ్డారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు రావడంతో.. 2024 ఆగస్టు 17న కర్ణాటక గవర్నర్ గెహ్లాట్.. సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో.. సిద్ధారామయ్య రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. అతని పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.. కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని, మధ్యంతర నిలుపుదల చేయలేమని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. దాంతో.. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Also Read : UBER – Auto Drivers : మీ రైడ్ క్యాన్సిల్ అయ్యిందా – మాకు సంబంధం లేదు- ఉబర్ కొత్త పాలసీ
గతేడాది ఆగస్టులోనే లోకాయుక్త విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి, ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జునపై కేసులు నమోదు కావటం, లోకాయుక్త ఎస్‌పీ టి.జె.ఉదేశ్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సిద్ధారామయ్యను ఏ1 నిందితుడిగా చేర్చుతూ.. కేసు నమోదు కాగా.. ఆయన భార్య తనకు ముడా ఇచ్చిన స్థలాలను వెనక్కి ఇచ్చేశారు. ఆ తర్వాత.. గతేడాది నవంబరు 5న మైసూరులోని లోకాయుక్త కార్యాలయంలో సీఎం విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాతి పరిణామాల్లో.. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవంటూ.. లోకాయుక్త పోలీసుల కేసును మూసివేసేందుకు నిర్ణయించారు.