KumbhMela Mauni Amavasya | ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది. ఈ పవిత్ర కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతున్నారు. గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేస్తున్నారు.
ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మౌని అమావాస్య రోజున వీఐపీ జోన్ ఉండదని, ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రయాగ్‌రాజ్‌లోకి వాహనాలను అనుమతించబోమని, భక్తుల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఆ రోజున సుమారు 8-10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉండటంతో 12 కిలోమీటర్ల పొడవైన ఘాట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. 144ఏళ్ల తర్వాత అరుదైన గ్రహాల కలయిక ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ మేలాకు ప్రత్యేకత నెలకొన్నట్లు పేర్కొన్నారు.
అఖిల భారతీయ అఖాడా పరిషద్ (ఏబీఏపీ) అఖాడాలైన సాధువులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. 13 లక్షల మంది అఖాడాలు తమకు కేటాయించిన సమయంలోనే త్రివేణి సంగమంలో ‘అమృత్ స్నాన్’ చేయాలని సూచించింది. ఈ చర్య వల్ల ఇతర భక్తులకు అసౌకర్యం కలగదని పేర్కొంది. వారి రాకపోకల కోసం ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: యుపిలో కరెంటు లేదు.. ఢిల్లీ అంతా చెత్త.. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ Vs యోగీ
జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (వసంత పంచమి), ఫిబ్రవరి 12 (మాఘ పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) వంటి ముఖ్య పర్వదినాల్లో భక్తులు అమృత్ స్నానాలు ఆచరించనున్నారు.
ఈ అంశంపై ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ ఉన్నతాధికారి డిఐజి వైభవ్ కృష్ణ మాట్లాడుతూ.. ఆ రోజు ప్రత్యేకంగా మేము ఒక జోనల్ సిస్టమ్ ని రూపొందించాం. ఈ సిస్టమ్ ప్రకారం.. కుంభమేళాలో అరేయిల్ ఘాట్ వైపునుంచి వచ్చే వారు అరేయిల్ ఘాట్ వద్దే పుణ్య స్నానాలు ఆచరించాలి. అలాగే ఝుల్సీ వైపు నుంచి విచ్చేసే భక్తులు ఝుల్సీ ఘాట్ వద్దనే స్నానాలు చేయాలి. ట్రాఫిక్ సమస్యను నివారించడానికి పోన్ టూన్ బ్రడ్జీలపై వన్ వే సిస్టం పెట్టాం. అయినా ట్రాఫిక్ సమస్య వస్తే.. అసలు ఆ బ్రిడ్జీల ద్వారా రాకపోకలు నిలిపివేస్తాం. అఖారా సాధువులకు కూడా మర్గదర్శకాలు సూచించాం. వారికి కేటాయించిన సమయంలో.. కేటాయించిన ప్రదేశంలో, మార్గం ద్వారా వారు రాకపోకలు చేయాలి. జనవరి 27 నుంచి జనవరి 30 వరకు కుంభ్ ప్రాంతంలో ఎటువంటి వాహనాల రాకపోకలపై నిషేధం విధించాం. ఈ రోజుల్లో విఐపి ప్రొటోకాల్ అనుసరించడం కుదరదు. అని చెప్పారు.
యుపి రాష్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వే శాఖ ప్రయగారజ్ నుంచి మౌనిఅమావాస్య రోజు 150 స్పెషల్ రైళ్ల రాకపోకలు నిర్వహించనుందని సమాచారం. ప్రయాగ్ రాజ్ సమీపంలోని 9 రైల్వే స్టేషన్లకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు చేస్తాయి. ప్రయాగా రాజ్ నుంచి ప్రతి 4 నిమిషాలకు ఒక రైలు ఆ రోజు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
మౌని అమావాస్య రోజు దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు కుంభమేళాకు రానుండడంతో దాదాపు 10 నుంచి 20 లక్షల మంది ఈ రైళ్ల ద్వారానే ప్రయాణాలు సాగించే అవకాశముందని అంచనా. ప్రయాగ్ రాజ్ తోపాటు వారణాసి, అయోధ్య ప్రాంతాల్లో కూడా మౌని అమావాస్య రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. అయోధ్యలో అయితే ఆ ఒక్క రోజు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా. సంక్రాంతి సందర్భంగా జనవరి 14 నుంచి 16 వరకు అయోధ్య రామమందిరానికి 10 లక్షల మంది భక్తులు దర్శనం కోసం వెళ్లారు. అదే సమయంలో వారణాసిలో 7.41 లక్షల మంది భక్తులు మహాశివుడికి పూజలు చేశారు.