India Terrorism| పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానిక దాడులు జరిపిన తరువాత ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ సెక్యూరిటీ అనలిస్ట్ మైకేల్ రూబిన్ భారతదేశానికి ముఖ్యమైన సూచనలు చేశారు. ఉగ్రవాదం పోరాడాలంటే సుదీర్ఘ కార్యాచరణ చేపట్టాలని.. ఇజ్రాయెల్‌ను ఉదాహరణగా చూపుతూ ఉగ్రవాదులను వేటాడాలని అన్నారు.
ఒక జాతీయ మీడియా ఇంటర్‌వ్యూలో మైకేల్ రూబిన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ మహిళా ప్రధాన మంత్రి గోల్డా మేయర్ ఉగ్రవాదులను అంతం చేయడానికి 1972లో ఏ విధంగా ప్లానింగ్ చేశారో.. ఆ విధానాన్ని ఆదర్శంగా తీసుకొని ఇండియా కూడా లాంగ్ టర్మ్ కౌంటర్ టెర్రరిజం చేయాలని సూచించారు. 1972 సంవత్సరం జర్మనీలోని మునిచ్ నగరంలో సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ బ్లాక్ సెప్టెంబర్ బాంబు దాడులు చేసింది. ఆ నరమేధంలో ఇజ్రాయెల్ కు చెందిన 11 మంది అథ్లెట్లు చనిపోయారు. అంతకుముందు కూడా పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద మూకలు పలుమార్లు ఇజ్రాయెల్ లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు చేశారు.
ఉగ్రవాదులతో విసిగి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇక వారిని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి గోల్డా మేయర్ ఉగ్రవాదులు ఏ మూలలో దాగి ఉన్నా.. వారిని కఠినంగా శిక్షించాలని ప్రణాళిక రూపొందించారు. ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ పేరుతో ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్‌కు 7 సంవత్సరాల పాటు సాగే ఒక మిషన్ అప్పగించారు. ఇజ్రాయెల్ పై దాడులు చేసే ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూలలో దాగి ఉన్నా.. వారిని వెతికి వేటాడమని ఆమె ఆదేశాలిచ్చారు. మోసాద్ ఈ ఆపరేషన్ లో విజయం సాధించింది. దాదాపు తమ దేశంపై దాడులు చేసే ఉగ్రవాదులందరినీ టార్గెట్ చేసి కచ్చితమైన ప్లానింగ్ తో చంపింది. అంతేకాదు ఇజ్రాయెల్ ఆ తరువాత కూడా తమ దేశ వ్యతిరేక శక్తులను కూడా విదేశాల్లో ఇలాగే హత్యలు చేసింది. ఈ విధమైన ప్లానింగ్ తోనే భారతదేశం కూడా ఉగ్రవాదంపై పోరాటం సాగించాలని మైకేల్ రుబిన్ సూచనలు చేశారు.
“దివంగత ఇజ్రాయెల్ మాజీ ప్రధాని గోల్డా మెయిర్ ప్రణాళికల పుస్తకం నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆమె విధానాలను ఆదర్శంగా తీసుకొని ఉగ్రవాదులను వెంబడించాలి, వారికి సహకారం అందించే వారికి నాశనం చేయాలి. వారు ఏ దేశంలో ఉన్నారనేది ఇక ఆలోచించకూడదు.” అని రూబిన్ అన్నారు.
Also Read: పాకిస్తాన్‌ని ఉగ్రవాద దేశంగా అమెరికా ప్రకటించాలి.. పెంటగాన్ అధికారి
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత ప్రధాని మోడీ ఒక సభలో మాట్లాడుతూ ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. “ఈ భూగ్రహంపై ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా.. వారిని భారత్ వేటాడుతుంది.. వారి ఊహకందని విధంగా కఠినంగా శిక్షిస్తుంది”. అని చెప్పారు. భారత దేశంల మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పహల్గాంలో ఉగ్రవాదులు ఏరి కోరి హిందువులను టార్గెట్ చేశారు. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు చనిపోయారు. లష్కరె తయిబా కు అనుబంధ ఉగ్రవాద సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడుల చేసినట్లు ప్రకటించుకుంది.
దీనికి ప్రతి చర్యగానే భారతదేశం.. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తన్ భూభాగంలో వైమానిక దాడులు చేసింది. ఆ తరువాత నుంచి పాకిస్తాన్, భారత్ మధ్య వైమానికి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై మైకేల్ రూబిన్ మాట్లాడుతూ.. “పాకిస్తాన్ లో ఉగ్రవాదులు శరణం పొందుతున్నారు. వారికి పాక్ ఆర్మీ బాసటగా ఉందని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే ఉగ్రవాదులకు సహకరించడం లేదని వాదించాలనుకుంటే ముందు ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను మూసేయాలి. ఉగ్రవాదులను అరెస్ట్ చేసి భారత్ కు అప్పగించాలి. వారు పాక్ ఆర్మీ లో ఉన్నా సరే” అని రూబిన్ వ్యాఖ్యానించారు.
అలాగే ఉగ్రవాదులు ఒక దాడి చేసి కాస్త విరామం తరువాత మళ్లీ దాడి చేస్తారని.. అందుకే వారి కోసం నిరంతరం గాలిస్తూ అంతం చేయాల్సిందేనని..అజాగ్రత్తగా ఉండకూడదని హెచ్చరించారు.