తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ‘ఆది తిరువతిరై’ ముగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. చోళ రాజు రాజేంద్ర చోళ-1 జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాజేంద్ర చోళుడి స్మారక నాణెం విడుదల చేశారు మోదీ. తండ్రీ కొడుకులు రాజరాజ చోళ, రాజేంద్ర చోళ.. స్మారక విగ్రహాలు నిర్మిస్తామని ప్రకటించారు. చోళులు గంగైకొండ చోళపురం రాజధానిగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలించారు. ఇక్కడే దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద శివాలయం గంగైకొండ చోళపురం ఆలయం ఉంది. ఉదయం స్వామి దర్శనం చేసుకున్న ప్రధాని మోదీ ఆ తర్వాత ఆది తిరువతిరై ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Prayed at the Brihadisvara Temple, Gangaikonda Cholapuram. It was a deeply spiritual experience at one of India’s finest expressions of Chola devotion. I prayed for the prosperity and well-being of the people of India. pic.twitter.com/uUzgbrJQO2
— Narendra Modi (@narendramodi) July 27, 2025
చోళ సామ్రాజ్యంలో..
నాటి చోళ సామ్రాజ్యం, చోళ రాజుల పరిపాలనా విధానాలపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. చోళ సామ్రాజ్యం భారతదేశ స్వర్ణ యుగాల్లో ఒకటి అని పేర్కొన్నారు. చరిత్రకారులు చాలామంది ప్రజాస్వామ్యానికి తొలి అడుగు బ్రిటన్ లోని మాగ్నా కార్టా అనే హక్కుల పత్రం గురించి చెబుతారని, కానీ అంతకు ముందే భారత్ లో చోళ రాజులు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలించారని చెప్పారు మోదీ. చోళ సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. దండయాత్రల్లో విజయం తర్వాత అక్కడి సంపదను దోచుకునే రాజుల గురించి మనం విన్నామని.. కానీ చోళ రాజులు.. శ్రీలంక, మాల్దీవులు ఆగ్నేయాసియాలోని పలు రాజ్యాలను గెలిచినా.. వారితో దౌత్య సంబంధాలు కొనసాగించారని చెప్పారు మోదీ.
The great Cholas inspire us to make our nation strong and further the spirit of unity. pic.twitter.com/jKsO8qcaWk
— Narendra Modi (@narendramodi) July 27, 2025
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం
తమిళనాడు పర్యటనలో భాగంగా రూ.450 కోట్లతో తూత్తుకుడి విమానాశ్రయంలో విస్తరించిన కొత్త టెర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.4,900 కోట్లతో పూర్తిచేసిన వివిధ రహదారులు, రైల్వే మార్గాలను జాతికి అంకితం చేశారాయన. మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తన విదేశీ పర్యటనల అంతరం మోదీ నేరుగా తమిళనాడుకు రావడం విశేషం. మాల్దీవుల నుంచి నేరుగా మోదీ ప్రత్యేక విమానంలో తమిళనాడుకు వచ్చారు. ఈ సందర్భంగా తన విదేశీ పర్యటనల విశేషాలను కూడా ఆయన తెలిపారు. బ్రిటన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని, దీని ద్వారా భారత్ కి ఎంతో మేలు జరుగుతుందన్నారు మోదీ. మన దేశానికి సంబంధించిన 99 శాతం ఉత్పత్తులపై బ్రిటన్‌లో పన్నులు ఉండవని తెలిపారు. ఆమేరకు మన ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఇక బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై కూడా పన్నులు తగ్గిపోతాయని, అవి చౌకగా లభిస్తాయని అన్నారు. మన ఎగుమతులు పెరగడం అంటే.. ఇక్కడ వస్తువులకు డిమాండ్ కూడా పెరిగినట్టేనని అన్నారు. దీంతో మన దేశంలో వాటి ఉత్పత్తిని పెంచాల్సి వస్తుందని, ఉత్పత్తి పెంచాలంటే ఆమేరకు ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పారు. మన యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల లభిస్తాయని చెప్పారు. అదే సమయంలో రైతులు, మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, స్టార్టప్‌లకు కూడా మంచి రోజులు వస్తాయన్నారు. తమిళనాడు అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు మోదీ.