Sanjay Raut Mohan Bhagwat KumbhMela | రాజకీయ నేతలు కుంభమేళాలో పాల్గొనడంపై శివసేన (శిందే) మరియు శివసేన (యూబీటీ) నేతల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కుంభమేళాకు వెళ్లలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తిరస్కరించారు. “బిజేపీ నేతలు అందరూ కుంభమేళాకు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయా?” అని ప్రశ్నించారు.
హిందూ ధర్మ పరిరక్షణ గురించి ప్రచారం చేసే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఎందుకు చేయలేదని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్న దృశ్యాలను చూశాను. అయితే.. ఆయన ప్రధానమంత్రి కాకముందు కుంభమేళాకు వెళ్లినట్లు ఆధారాలు లేవు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యులు మోహన్ భాగవత్, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, గురు గోల్వాల్కర్, బాలాసాహెబ్ దేవరాస్ వంటివారు పవిత్ర స్నానం ఆచరించినట్లు ఫొటోలు లేవు,” అని సంజయ్ రౌత్ విమర్శించారు.
ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే పరోక్షంగా ఉద్ధవ్ ఠాక్రేపై కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయలేదని విమర్శించారు. “కొందరు నేతలు తాము హిందువులమని చెప్పుకుంటారు. కానీ.. పవిత్ర కుంభమేళాకు వెళ్లకుండా దాటవేశారు,” అని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి రాందాస్ ఆఠవలే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే కుంభమేళాను సందర్శించకుండా హిందూ సమాజాన్ని అవమానించారని ఆరోపించారు.
Also Read: కేంద్ర మంత్రి కూతురిని వేధించిన పోకిరీలు.. మహారాష్ట్రలో కలకలం
కూటమిలో అంతా కుశలమే: ఏక్‌నాథ్ శిందే
మరోవైపు మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో చీలికలు వచ్చాయని.. ఏక్ నాథ్ షిండే శివసేన శివసేన పార్టీని బిజేపీలో విలీనం చేసేందుకు ఒత్తిడి చేస్తున్నారని సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో విభేదాలు ఉన్నాయని వచ్చే వార్తలను డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే తిరస్కరించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మరియు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో మాట్లాడిన ఆయన, “మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. కూటమి విచ్ఛిన్నం అయ్యే ప్రసక్తే లేదు,” అన్నారు.
“మీరెన్ని బ్రేకింగ్ న్యూస్‌లు ఇచ్చినా.. మా కూటమి విచ్ఛిన్నం కాదు. కోల్డ్‌వార్ వంటి పరిస్థితి లేదు. ఎండలతో మండిపోతున్న మహారాష్ట్రలో కోల్డ్‌వార్ ఎలా సాధ్యం?” అని ఏక్‌నాథ్ శిందే చమత్కరించారు. తాను, ఫడణవీస్ బాధ్యతలు మాత్రమే మార్చుకున్నామని, అజిత్ పవార్ అదే బాధ్యతల్లో కొనసాగుతున్నారని చెప్పారు.
ఏక్‌నాథ్ శిందే.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమావేశాలకు ఇటీవల దూరంగా ఉండడం, శిందే వర్గం ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించడం వంటి విషయాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ ఊహాగానాలను తిరస్కరిస్తూ.. కూటమిలో వాతావరణం బాగానే ఉందని ఏక్‌నాథ్ శిందే స్పష్టం చేశారు.