Eye Drops Glaucoma| ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు తక్షణ పరిష్కారంగా డాక్టర్లను సంప్రదించకుండానే స్వయంగానే మందులు తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. కళ్ళు ఎర్రబారడం, కంటి లో దురద, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు ఎదురైనప్పుడు చాలామంది డాక్టర్‌ని సంప్రదించకుండా స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు లేదా నాసల్ ఇన్హేలర్లు వాడేస్తున్నారు. వీటి వల్ల తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు.. కానీ దీర్ఘకాలికంగా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఇటీవల గ్లాకోమా సమస్యతో బాధపడుతున్నవారిలో పదేళ్ల వయసు పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణంగా గ్లాకోమా 40 ఏళ్లు దాటిన వారిలో కనిపించే వ్యాధిగా పరిగణించబడుతుంది. కానీ చిన్నపిల్లలలో ఈ వ్యాధి పెరుగుతున్నదాన్ని గమనించిన వైద్యులు దీనిపై పరిశోధన జరిపారు. ఆ పరిశోధనలో ఎదురైన విషయాలు శోకకరంగా ఉన్నాయి. చిన్న చిన్న అలెర్జీలకు స్టెరాయిడ్ కంటి చుక్కలు వాడటం వలన చిన్నారుల్లో గ్లాకోమా బారినపడే అవకాశాలు పెరిగినట్లు తేలింది.
స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ లేదా ఇన్హేలర్లు వాడటం వల్ల కంటిలో ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆప్టిక్ నరాలపై ప్రభావం చూపించి, వాటిని దెబ్బతీయడం ద్వారా గ్లాకోమా కు దారితీస్తుంది. దీన్ని సమయానికి గుర్తించకపోతే దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా వంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇంకా గమనించదగ్గ విషయం ఏమిటంటే, చాలామంది గ్లాకోమా ఉన్నప్పటికీ వారు దానిని ప్రారంభ దశలో గుర్తించలేరు. చాలా సందర్భాల్లో ఈ వ్యాధి చివరి దశలో మాత్రమే బయటపడుతోంది. అప్పటికే కంటికి పాక్షికంగా లేదా పూర్తిగా నష్టం జరుగుతుంది.
ముఖ్యంగా గ్లాకోమా బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉండే వారు ఎవరోనంటే – 40 ఏళ్లు పైబడినవారు, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు, కుటుంబంలో గ్లాకోమా చరిత్ర ఉన్నవారు, కంటి గాయానికి లోనైనవారు. వీరంతా కంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. అలాగే స్టెరాయిడ్ ఆధారిత క్రీములు, ఇంజెక్షన్లు, మాత్రలు కూడా అధికంగా వాడకూడదు.
Also Read: పార్టీల పేరుతో ఇవి తింటున్నారా?.. ఆరోగ్యం సర్వనాశనం..
ముఖం మీద వేసే క్రీముల్లోనూ, కళ్ల చుట్టూ అప్లై చేసే స్టెరాయిడ్ క్రీముల వలన కూడా గ్లాకోమా ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరిగితే కూడా కంటిలో ఒత్తిడి పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఆరు వారాల కన్నా ఎక్కువ కాలం స్టెరాయిడ్ తీసుకుంటున్నవారు తప్పకుండా గ్లాకోమా పరీక్షలు చేయించుకోవాలి.
గ్లాకోమా అనేది అతి మెల్లగా అభివృద్ధి చెందే, ఆరంభ దశలో లక్షణాలు కనిపించనిది. అందుకే కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకుని, తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్ కంటి చుక్కలు లేదా ఇన్హేలర్లు వాడటం ఒక తీవ్రమైన పొరపాటని గుర్తించాలి. ముందుజాగ్రత్తలతో గ్లాకోమాను నియంత్రించి, దృష్టిని కాపాడుకోవచ్చు.