Harish Rao: స్వేచ్చ బ్యూరో: పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర సచివాలయం కాంగ్రెస్ పాలనలో నిరసనల అడ్డాగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుఅన్నారు. ఎక్స్ వేదికగా సోమవారం ప్రభుత్వం పై మండిపడ్డారు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టి.. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా.. ఇంకెంత కాలం తప్పించుకు తిరుగుతారు..బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం దారుణం అన్నారు.
పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 20 -30% కమిషన్ డిమాండ్ చేస్తున్నారంటూ గతంలో సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ముందు ఆందోళనకు దిగారు అంటే కమీషన్లు ఇవ్వలేదనే కారణంతోనే వారి బిల్లులు ఆపుతున్నారా? అని నిలదీశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేస్తామని మే నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలేనా? మాటలు కోటలు, దాటితే చేతలు గడప దాటవు అనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? అని మండిపడ్డారు.
రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ఆవేదన వినే సమయం కూడా ఈ ప్రభుత్వానికి లేదా?30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా?2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెన్ఫిట్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని నిలదీశారు.
Also read: నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న ‘రోమాంచకం’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సర్వీసులో దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండటం అమానవీయం, అనైతికం! సమస్యలు వినడానికే సిద్ధంగా లేని ప్రభుత్వం.. పరిష్కారం ఎలా చూపుతుంది? అని మండిపడ్డారు. ప్రజల సమస్యలు వినాల్సిన ప్రభుత్వం ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే పోలీసులతో అడ్డుకునే దుస్థితి!ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “ప్రజా పాలన”?ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు , 420 హామీలు అంటూ ప్రజలను మభ్య పెట్టడం…అధికారంలోకి వచ్చాక ప్రజలకే అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం!ఇది ప్రజా పాలనా? లేక కాంగ్రెస్ మార్క్ వంచనా? అని తీవ్రస్థాయిలో హరీష్ రావు మండిపడ్డారు.
Also read: వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా