Kerala Elephant Chaos | కేరళలో విషాదకరమైన ఘటన జరిగింది. దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా పటాకుల శబ్దానికి బెదిరిపోయిన ఏనుగులు భక్తులపై దాడి చేసి, వారిని తొక్కి చంపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి సమీపంలోని కురవంగడ్‌లోని మనక్కులంగర భగవతి ఆలయ ప్రాంగణంలో వార్షిక ఉత్సవం జరిగింది. ఉత్సవం చివరి రోజున నిర్వాహకులు రెండు ఏనుగులను తీసుకువచ్చారు.
ఉత్సవ సమయంలో నిర్వాహకులు బాణసంచా పేల్చారు. దీంతో ఆ రెండు ఏనుగులు బెదిరిపోయాయి. ఆ తరువాత రెండు ఏనుగులు ఒకదానితో మరొకటి తలపడ్డాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న భక్తులపై దాడి చేస్తూ.. వారిని తొక్కుకుంటూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.
‘‘ఈ దుర్ఘటన గురువారం, ఫిబ్రవరి 13, 2025 సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది. ఏనుగులను సాయంత్రం ఊరేగింపు కోసం ప్రదర్శిస్తుండగా, పటాకుల శబ్దం విన్న తర్వాత అకస్మాత్తుగా వాటిలో ఒక ఏనుగు బెదిరిపోయింది. మరో ఏనుగుతో ఘర్షణకు దిగింది. ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఏనుగులు ఒకదానికొకటి తోసుకోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యాలయం కూడా కూలిపోయింది’’ అని కౌన్సిలర్ చెప్పారు.
Also Read: ప్రేమికులకు విశ్వహిందూ పరిషత్ వార్నింగ్.. స్త్రీలకు కొరడా దెబ్బలు!
దేవాలయంలో జరిగిన ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రెండు ఏనుగులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, క్రాకర్ల శబ్దానికి ఏనుగులు బెదిరిపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు.
కోయిలాండి ఎమ్మెల్యే కనాతిల్ జమీలా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏనుగులు టపాసుల శబ్దానికి బెదిరిపోయాయి. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాయి. ఆ సమయంలో భక్తుల మధ్య తొక్కిసలాట, తోపులాట జరిగింది. గాయపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించాము’’ అని తెలిపారు.
వారం రోజుల క్రితమే ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కేరళలోని త్రిస్సూరు జిల్లా పైంగన్నిక్కల్ దేవాలయ ఉత్సవాల కోసం ఒక ఏనుగుని స్నానం చేయిస్తూ ఉండగా.. అది మదమెక్కి చుట్టుపక్కల ఉన్నవారందరిపైనా దాడి చేసింది. ఈ ఘటనలో దాని మహావటుతో పాటు ఇద్దరికీ తీవ్ర గాయాలకు కాగా.. ఆనంద్ అనే 38 ఏళ్ల యువకుడిని ఏనుగు తొక్కి చంపేసింది. ఆ తరువాత ఏనుగుని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించగా.. అది సమారు 8 కిలోమీటర్ల వరకు పరుగులు తీసింది. ఏనుగుని నియంత్రించేందుకు పోలీసులు, ఎలిఫెంట్ స్క్వాడ్ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏనుగు ఈ క్రమంలో వరి పొలాన్ని నాశనం చేసింది. గాయపడిన ఇద్దరినీ చావక్కాడ్ తాలుకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏనుగుల చేత ఇలా దేవాలయ ఉత్సవాల్లో ఊరిగింపు చేయకూడదని గతంలో కేరళ హై కోర్టు నిషేధం విధించింది. కానీ హై కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ.. కేరళకు చెందిన తిరువంబాడి, పారమెక్కవు దేవస్థానాలు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. జస్టిస్ బివి నాగరత్న, ఎన్‌కె సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం హై కోర్టు తీర్పుపై డిసెంబర్ 2024లో స్టే విధించింది.