Aadhaar Update: ఆధార్ కార్డు పేరు చెప్పగానే చాలామంది టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి అప్ డేట్స్ వస్తాయో, మార్చుకోవడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు కావాలని అడుగుతాయో తెలియక బెంబేలెత్తిపోతుంటారు. తాజాగా పిల్లల ఆధార్ బయో మెట్రిక్ పాఠశాలలో అప్‌డేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు UIDAI CEO భువనేశ్ వెల్లడించారు. నిజంగా చెప్పాలంటే ఇది పిల్లలకు శుభవార్త.
దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. పాఠశాలలు మొదలు ఏ ప్రభుత్వ ఆఫీసులకు పని మీద వెళ్లినా కచ్చితంగా ఆధార్ ఉండాల్సిందేనని చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్నిసేవలకు కీలకంగా మారింది. పిల్లలకూ ఆధార్ తప్పనిసరి అయ్యింది.
పుట్టిన పిల్లలకు అప్పటికప్పుడే బాల ఆధార్ ఇస్తున్నారు. అయితే ఏడేళ్ల తర్వాత పిల్లలు ఆధార్‌ని తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులకు కాస్త ఇబ్బందికరంగా మారింది. దీన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా -UIDAI గుర్తించింది. పిల్లల ఆధార్ బయో మెట్రిక్ పాఠశాలలో అప్డేడేట్ చేసే విధానాన్ని త్వరలో తీసుకొస్తున్నట్లు UIDAI CEO భువనేశ్ వెల్లడించారు.
రెండు నెలల్లో ఈ పద్దతి అమల్లోకి రానుంది. ఐదేళ్ల వయసు దాటిన పిల్లల సంఖ్య ప్రస్తుతం 7 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో చిన్నారుల ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను సులభతరం చేసే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తల్లిదండ్రుల అంగీకారంతో పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్‌ను స్కూళ్లలో చేపట్టేందుకు ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ALSO READ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులివే
ప్రస్తుతం సాంకేతికతను పరీక్షిస్తున్నామని, నెలన్నర లేదా రెండు నెలల్లో పూర్తి కావచ్చని అంటున్నారు. ప్రతి జిల్లాకు బయో మెట్రిక్ యంత్రాలను పంపించి ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్ కీలకంగా మారిందని, ప్రతి చిన్నారికీ ప్రయోజనాలు అందాలంటే ఆధార్ తప్పనిసరి అన్నారు.
ఈ నేపథ్యంలో పాఠశాలల ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలనుకుంటున్నట్లు మనసులోని మాట బయపెట్టారు భువనేశ్ కుమార్. ఏడేళ్లు వయసు తర్వాత బయోమెట్రిక్ చేయకపోతే ఆధార్ డీయాక్టివేట్ అవుతుంది. 5-7 ఏళ్ల మధ్య చిన్నారులకు ఆధార్ అప్‌డేప్‌కు ఎలాంటి రుసుము అవసరం లేదు. ఏడేళ్లు దాటితే వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.