US India Illegal Immigrants Deportees | అమెరికా అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిరిగి పంపించే ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తోంది. ఇటీవల కొందరు భారతీయులను తిరిగి పంపించిన విషయం తెలిసింది. ఈ క్రమంలో మరో రెండు విమానాల ద్వారా అక్రమ వలసదారులను భారతదేశానికి పంపనున్నట్లు సమాచారం. వీరందరూ ఫిబ్రవరి 15న అమృత్సర్ చేరనున్నారు.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం భారతీయ, ఇతర దేశాలకు చెందిన అక్రమ వలసదారులను గుర్తించేందుకు నిరంతరాయంగా తనిఖీలు చేస్తోనే ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న 104 మంది భారత్ అక్రమ వలసదారులను అమెరికా సైనిక విమానం ద్వారా అమృత్సర్‌కు తరలించింది. అక్రమ వలసదారుల విషయంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు. అమెరికాలో 487 మంది భారతీయ అక్రమ వలసదారులను గుర్తించినట్లు తెలిపారు. వారిని స్వదేశానికి తిరిగి పంపించేందుకు ఆదేశాలు జారీ చేయబడ్డాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం మరిన్ని మందిని భారతదేశానికి పంపనుంది.
అమృత్‌సర్ నగరంలోనే ఎందుకు?
మరోవైపు, అక్రమ వలసదారులను తీసుకువచ్చే విమానాలను అమృత్సర్‌లో దించడం విమర్శలను ఎదుర్కొంటోంది. అమెరికాలో అక్రమంగా ఉన్న భారతీయులను తీసుకువస్తున్న విమానాలు పంజాబ్‌లోని అమృత్సర్‌కే ఎందుకు వస్తున్నాయనేది ప్రశ్నగా మారింది. గుజరాత్, హర్యానా లేదా ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు? ఇప్పుడు ఈ విషయం మీద రాజకీయ వివాదం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విమానాలను అమృత్సర్‌కు పంపిస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు.
Also Read: ప్రైవేట్ విమానంలో బ్యాంకాక్ బయలుదేరిన మంత్రి కుమారుడు.. గాల్లోనే కిడ్నాప్?
పంజాబ్ పేరును చెడగొట్టేందుకే బీజేపీ ఉద్దేశపూర్వకంగా విమానాలను అమృత్సర్‌కు పంపిస్తోందని మాన్ ఆరోపించారు. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆరోపించారు.
శనివారం (ఫిబ్రవరి 15) రానున్న మరో విమానంలోని వారికి భగవంత్ మాన్ స్వయంగా స్వాగతం పలకనున్నారు. ఇందుకుగాను ఆయన ఇప్పటికే అమృత్సర్ చేరుకున్నారు. కాంగ్రెస్ కూడా కేంద్ర ప్రభుత్వంపై భగవంత్ మాన్ తరహాలోనే ఆరోపణలు చేస్తోంది. అయితే బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరైనది కాదని బీజేపీ హితవు పలుకుతోంది. ఆదివారం (ఫిబ్రవరి 16) కూడా భారతీయులతో కూడిన మరో విమానం అమెరికా నుంచి రానుంది.
అయితే, ఫిబ్రవరి 5న తొలి విమానంలో వచ్చిన 104 మంది అక్రమ వలసదారుల్లో అత్యధికంగా 33 మంది గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం. మరోవైపు అమెరికా ట్రంప్ ప్రభుత్వం మెక్సికో, బ్రెజిల్ ఇతర దక్షిణ అమెరికా దేశాలకు చెందిన అక్రమ వలసదారులను కూడా తిరిగి వారి దేశాలకు సాగనంపుతూనే ఉంది. మెక్సికోలో అయితే ఈ అక్రమ వలసదారులను ఆ దేశం శరణార్థుల శిబిరాల్లో ఆశ్రయం కల్పించింది.