Harish Rao: సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తానీర్ హరీష్ రావు బుధవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తనపై చేసిన అసత్య ఆరోపణలపై ఆయన క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టులో తన స్టేట్‌మెంట్ నమోదు చేసేందుకు ఆయన స్వయంగా హాజరయ్యారు.
క్షుద్ర పూజల ప్రచారంపై తీవ్ర ఆగ్రహం
కోర్టు ప్రాంగణంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నేను క్షుద్ర పూజలు చేశానంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై ఆధారాలతో సహా కోర్టులో కేసు వేశాను. కోర్టు నా పిటిషన్‌ను స్వీకరించింది. ఈ నెల 30న నా స్టేట్‌మెంట్‌ను పూర్తిస్థాయిలో రికార్డ్ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు’ అని వెల్లడించారు. భవిష్యత్తులో తనపై ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేస్తే చట్టపరంగా ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
హామీలను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ డ్రామాలు
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయం చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా కనీసం డిప్యూటీ స్పీకర్‌ను కూడా నియమించలేకపోయారని, సభ హక్కుల ఉల్లంఘన నోటీసులపై స్పీకర్ స్పందించడం లేదని ఆరోపించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
దానం నాగేందర్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి సర్కారుకు చెంపపెట్టని హరీష్ రావు అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే దానం నాగేందర్‌కు పట్టిన గతే మిగతా ఎమ్మెల్యేలకు పడుతుందని, ఇప్పటికైనా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కనువిప్పు తెచ్చుకోవాలని స్పష్టం చేశారు.
Also Read: 48 గంటల్లో CEC రాజీనామా చేయాలి.. లేకపోతే నిరసనలు: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే