Oldest Marathon Fauja Singh Death| ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ కారు ప్రమాదంలో మరణించారు. ఆయన రోడ్డు దాటుతుండగా.. ఒక ఎస్‌యువి కారు ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన పంజాబ్ లోని జలంధర్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బియాస్ పిండ్‌లో సోమవారం (జులై 14, 2025) జరిగింది. అయితే ఈ కేసులో పోలీసులు విచారణ చేసి మంగళవారం దుర్ఘటనకు కారణమైన వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఇది టొయోటా ఫార్చ్యూనర్ SUV, దీని రిజిస్ట్రేషన్ నంబర్ PB 20 C 7100. ఘటనా స్థలంలో లభించిన కీలక సాక్ష్యాల సహాయంతో ఈ వాహనాన్ని గుర్తించారు. సమీపంలోని CCTV ఫుటేజ్, అలాగే కారు హెడ్‌లైట్‌కు సంబంధించిన విరిగిన భాగాలు వాహనం నిర్ధారించడంలో సహాయపడ్డాయి.
ఆరోగ్యవంతమైన జీవితం గడిపిన ఫౌజా సింగ్ వయసు 114 ఏళ్లు. ఆయన కారు ప్రమాదం కారణంగా తలకు గాయాలు కావడంతో ఆయన మరణించాడు. ఈ కారు ప్రమాద ఘటనపై ఆదంపూర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్‌లు 281, 105 కింద FIR నమోదు చేయబడింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఫౌజా సింగ్, ‘టర్బన్డ్ టొర్నాడో’గా పిలవబడే ఈ 114 ఏళ్ల రన్నర్, జలంధర్‌లోని తన స్వగ్రామం బియాస్ పిండ్ సమీపంలోని జాతీయ రహదారిపై మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో జలంధర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించబడ్డాడు, కానీ సాయంత్రం గాయాల కారణంగా మరణించాడు. నిందితుడు సంఘటన స్థలం నుండి పరారీ అయ్యాడు.
ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న జన్మించారు. 1993లో ఇంగ్లాండ్‌కు వలస వెళ్లిన తర్వాత, 89 ఏళ్ల వయసులో మారథాన్‌లు పరుగెత్తడం ప్రారంభించారు. 2000లో లండన్ మారథాన్‌లో పాల్గొన్న ఆయన, 2011లో 100 ఏళ్ల వయసులో టొరంటో వాటర్‌ఫ్రంట్ మారథాన్‌ను పూర్తి చేసి, ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా గుర్తింపు పొందారు. 2000 నుండి 2013 వరకు 14 ఏళ్ల వ్యవధిలో ఆయన 9 పూర్తి మారథాన్‌లను పరుగెత్తారు. ఇది అసాధారణ రికార్డు. ఐదు ఏళ్ల వయసు వరకు నడవలేని ఫౌజా, తన జీవితంలో ఈ అద్భుతమైన ఘనతను సాధించారు.
ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. అడిదాస్ ‘ఇంపాజిబుల్ ఈజ్ నథింగ్’ ప్రచారంలో ముహమ్మద్ అలీ, డేవిడ్ బెక్‌హామ్‌లతో పాటు ఫౌజా సింగ్ కూడా భాగమయ్యారు. ఆయన 2012 లండన్ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా కూడా ఉన్నారు. ఫౌజా సింగ్ కారు ప్రమాదంలో మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా రన్నింగ్ కమ్యూనిటీ షాక్ కు గురైంది. ఆయన సాధారణ జీవనశైలి, క్రమశిక్షణ ఆహారం, సానుకూల దృక్పథం ఆయన దీర్ఘాయుష్షుకు కారణమని ఆయన స్వయంగా చెప్పేవారు.
Also Read: 2 పిల్లలతో కర్ణాటక అడవుల్లో ఒంటరిగా రష్యా మహిళ.. అటవీ అధికారులు చూసి షాక్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ఇతర రాజకీయ నాయకులు ఫౌజా సింగ్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన జీవితం, ఫిట్‌నెస్‌పై యువతకు స్ఫూర్తినిచ్చే విధానం అందరినీ ఆకర్షించింది. పోలీసులు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు, ఈ దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.