Amit Shah: లోక్‌సభలో ఇవాళ ఆపరేషన్ సిందూర్ చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయక టూరిస్టులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు.
అయితే.. ఈ రోజు లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆపరేషన్ సిందూర్ వివరాలను గురించి చెప్పారు. జైశంకర్ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష నాయకుల కొంత గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీ సొంత విదేశాంగ మంత్రికి మీరు గౌరవం ఇవ్వరా..?’ అని ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం భారతీయ విదేశాంగ మంత్రిపై నమ్మకం లేకపోవడం.. ఇతర దేశాలపై నమ్మకం ఉంచడం దారుణమని మండిపడ్డారు. మీ ప్రవర్తనే.. మిమ్మిల్ని ప్రతిపక్ష బెంచీలపై కూర్చోబెట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. మీరు మరో 20 ఏళ్ల పాటు ఇదే ప్రతిపక్షంలో ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: Viral Video: ఈ పాము ఆస్కార్ పర్ఫార్మెన్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే బ్రో..
కేంద్ర మంత్రి జైశంకర్ తన ప్రసంగంలో భారత్ దౌత్యపరమైన విజయాల గురించి చెప్పారు. పహల్గామ్ దాడికి బాధ్యత వహించిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించడం భారత దౌత్య విజయమని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌లోని బహవల్పూర్, మురిద్కేలలోని ఉగ్రవాద కేంద్రాలు కూల్చివేశామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భారత్ అంతర్జాతీయ దౌత్య ప్రభావాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా, క్వాడ్, బ్రిక్స్ వంటి సమూహాలు, అనేక దేశాలు పహల్గామ్ దాడిని ఖండించాయని, ఇది అంతర్జాతీయ సమాజంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు మద్దతును సూచిస్తుందని జైశంకర్ వివరించారు.
ALSO READ: Suleiman Shah: పహల్గామ్ మాస్టర్ మైండ్, డేంజర్ టెర్రరిస్ట్ సులేమాన్ షా హతం..
జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు భారత్‌కు మద్దతు తెలిపాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు స్వయం రక్షణ హక్కు ఉందని జర్మన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నట్లు జైశంకర్ సభలో వ్యాఖ్యానించారు. ఈ చర్చ భారత్ బలమైన అంతర్జాతీయ స్థితిని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో దాని నిరంతర ప్రయత్నాలను స్పష్టం చేసింది.