Romantic Drama OTT : కొన్ని సినిమాలు భారీ ట్విస్టులతో ఆకట్టుకుంటాయి. మరికొన్ని యాక్షన్, కామెడీతో అలరిస్తాయి. కానీ ఇంకొన్ని మాత్రం మన జీవితాన్నే అద్దంలా చూపిస్తాయి. మనం ఎక్కడ ఉన్నాం? ఎటు వెళ్తున్నాం? నిజంగా మనకు కావాల్సింది ఏంటి? అనే ప్రశ్నలు వేస్తాయి. అలాంటి హృదయానికి హత్తుకునే చిత్రమే ’29’. 2026లో విడుదలైన ఈ తమిళ కమింగ్-ఆఫ్-ఏజ్ రొమాంటిక్ డ్రామా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు రత్న కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో విధు, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కథలో సత్య అనే 29 ఏళ్ల యువకుడు తన జీవితంలో ఒక గందరగోళ దశలో ఉంటాడు. మంచి ఉద్యోగం ఉన్నా సంతోషం ఉండదు. భవిష్యత్తుపై స్పష్టత ఉండదు. తాను ఎవరు? జీవితంలో నిజంగా ఏం చేయాలనుకుంటున్నాడు? అనే ప్రశ్నలతో ఎప్పుడూ పోరాడుతుంటాడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి విజి అనే అమ్మాయి వస్తుంది.
విజిని కలిసిన తర్వాత సత్య జీవితంలో చిన్నచిన్న మార్పులు మొదలవుతాయి. ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ పెరుగుతాయి. అయితే ప్రేమ ఒక్కటే జీవితానికి సమాధానం కాదని, తనలోని భయాలు, సందేహాలు, అస్థిరతలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సత్య క్రమంగా గ్రహిస్తాడు. ఆ తర్వాత అతను తీసుకునే నిర్ణయాలు, తన జీవితానికి కొత్త అర్థాన్ని వెతికే ప్రయాణమే ఈ సినిమా ప్రధాన కథ.
29 బలం దాని కథనం. ఇందులో పెద్ద యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలివేషన్లు, ఊహించని ట్విస్టులు ఉండవు. బదులుగా మన చుట్టూ కనిపించే మనుషులు, వాళ్ళ ఎమోషన్స్, జీవితంలో వచ్చే సందిగ్ధ పరిస్థితులను చాలా రియాలిటీగా చూపించారు. సత్య పాత్రలో విధు నటన చాలా సహజంగా ఉంటుంది. 29 ఏళ్ల వయసులో చాలా మంది యువత ఎదుర్కొనే క్వార్టర్-లైఫ్ క్రైసిస్, కెరీర్ ఒత్తిడి, ప్రేమ, కుటుంబ బాధ్యతలు, జీవితంపై ఉండే అయోమయాన్ని దర్శకుడు హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు. ప్రీతి అస్రాని కూడా తన పాత్రలో ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఈ సినిమా చూసేటప్పుడు చాలా సందర్భాల్లో “ఇది మన కథే కదా” అనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి సంభాషణ, ప్రతి సన్నివేశం జీవితానికి దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా యువత తమ భవిష్యత్తు గురించి ఆలోచించే విధానాన్ని హార్ట్ టచింగ్ తో చూపించారు. కథ నెమ్మదిగా సాగినా, చివరికి ప్రేక్షకుడిలో ఒక సంతృప్తి అయితే మిగులుస్తుంది. ప్రేమ, జీవితానికి అర్థం వెతికే కథలు ఇష్టపడేవారికి 29 మంచి ఎంపిక. కమర్షియల్ హంగామా కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు చూడాలనుకుంటే ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను వీకెండ్‌లో ప్రశాంతంగా కూర్చుని చూసేయొచ్చు.
Read Also : వైర్‌లెస్ విద్యుత్ తో దెయ్యాల ఎంట్రీ… గూస్ బంప్స్ తెప్పించే సైన్స్ ఫిక్షన్ హార్రర్ మూవీ