OTT Movie : అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 దుర్ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో 265 మంది మరణించగా, ఒక్క వ్యక్తి మాత్రమే బతికి బయటపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఇలాంటి విమాన ప్రమాదం నేపథ్యంలో రూపొందిన ఓ ఉత్కంఠభరితమైన సర్వైవల్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.
ఈ స్టోరీలో ఒక రోజు రాత్రి కెప్టెన్ బ్రోడీ టొరెన్స్ తన విమానాన్ని తీవ్రమైన ఉరుములతో కూడిన తుఫాను గుండా నడుపుతుండగా, ఒక భయంకరమైన పిడుగు విమానంపై పడుతుంది. దీంతో విమానం దెబ్బ తిని, ప్రయాణికులలో ఆందోళన మొదలవుతుంది. ఇప్పుడు కెప్టెన్ ముందున్న ఏకైక లక్ష్యం 14 మంది ప్రయాణీకులను, ముగ్గురు క్యాబిన్ సిబ్బందిని సురక్షితంగా భూమిపైకి చేర్చడం. కానీ అతను విమానాన్ని ఒక ద్వీపంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది. ఇక అసలు స్టోరీ ఇప్పుడే మొదలవుతుంది. మరి ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ సింగపూర్‌లో ప్రారంభమవుతుంది. కెప్టెన్ బ్రోడీ టొరెన్స్ ఫ్లైట్ 119ను టోక్యో మీదుగా హోనోలులుకు నడపడానికి సిద్ధమవుతాడు. అతను తన కుమార్తె డానియెలాతో ఫోన్‌లో మాట్లాడి, హాలిడేలో ఇంటికి వెళ్లాలని అనుకుంటాడు. ఇప్పుడు ఈ విమానంలో 14 మంది ప్రయాణీకులు, ముగ్గురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. వీరిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, వ్యాపారవేత్త వంటి వ్యక్తులు ఉంటారు. అయితే ఈ విమానంలో లూయిస్ గాస్పరే అనే ఒక హత్యా నేరం ఆరోపణలు ఉన్న వ్యక్తి కూడా ఉంటాడు. అతనిని కెనడియన్ పోలీస్ ఆఫీసర్ షెల్‌బ్యాక్ కెనడాకు తీసుకెళ్తుంటాడు. ఈ ప్రయాణంలో బ్రోడీకి అతని ఉన్నతాధికారి సౌత్ చైనా సీ మీదుగా ఒక షార్ట్‌కట్ రూట్ తీసుకోమని ఆదేశాలు ఇస్తాడు. కానీ ఈ నిర్ణయం విమానాన్ని ఒక తీవ్రమైన తుఫాను మధ్యలోకి నెట్టివేస్తుంది. విమానం తుఫానులో చిక్కుకుని, పిడుగు పడి కమ్యూనికేషన్ వ్యవస్థ కట్ అవుతుంది.
తుఫాను మరింత తీవ్రమవడంతో విమానం క్రాష్ అవుతుంది. బ్రోడీ తలకు గాయమవుతుంది. ఒక ఫ్లైట్ అటెండెంట్, ఆఫీసర్ షెల్‌బ్యాక్ కూడా మరణిస్తారు. బ్రోడీ అతని కో-పైలట్ సామ్యూల్ డెలె కమ్యూనికేషన్ లేకుండా విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. విమానంలో ఇంధనం అయిపోయే స్థితిలో, దగ్గరలోని ఒక ద్వీపంలో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయిస్తారు. ఈ ల్యాండింగ్ విజయవంతమవుతుంది. కానీ వీళ్ళు ఆ భయంకరమైన ద్వీపంలో చిక్కుకుంటారు. అది ఫిలిప్పీన్స్‌లోని ఒక యుద్ధ పీడిత ప్రాంతం. ఇక్కడ రెబెల్స్, యుద్ధ నాయకులు ఆధిపత్యం చెలాయిస్తారు. బ్రోడీ, ప్రయాణీకులు ఇప్పుడు ఒక ప్రమాదకరమైన వాతావరణంలో చిక్కుకుంటారు.
ఆ ద్వీపంలో రెబెల్ నాయకుడు డాటు జున్మార్ ప్లేన్ క్రాష్ (Plane crash) ల్యాండింగ్ గురించి తెలుసుకుని, ప్రయాణీకులను బందీలుగా చేసి, ప్రభుత్వం నుంచి డబ్బులు దండుకోవాలని ప్లాన్ చేస్తాడు. బ్రోడీ, చీఫ్ ఫ్లైట్ అటెండెంట్ బోనీతో కలిసి, ప్రయాణీకులను శాంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. కమ్యూనికేషన్ కనుగొనేందుకు, బ్రోడీ లూయిస్‌తో కలిసి జంగిల్‌లోకి వెళ్తాడు. ఇక్కడ వీళ్ళు ఒక పాత వేర్‌హౌస్‌లో ఫోన్‌ను కనుగొంటారు. బ్రోడీ ఈ కమ్యూనికేషన్ తో అధికారులకు సహాయం కావాలని చెప్తాడు. కానీ ఇంతలోనే రెబెల్స్ వీళ్ళ పై దాడి చేస్తారు. చివరికి ఈ ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడతారా ? రెబెల్స్ వల్ల ఎటువంటి ప్రమాదాలు వస్తాయి ? బ్రోడీ ఈ సమస్యలను ఎలా అధిగమిస్తాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఆడవాళ్ళ కాళ్ళను కత్తిరించి చంపే సైకో … ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్టులు… ఒళ్ళు గగుర్పొడిచే సీన్లు
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్లేన్’ (plane). 2023 లో వచ్చిన ఈ సినిమాకి జీన్-ఫ్రాంకోయిస్ రిచెట్ దర్శకత్వం వహించారు. ఇందులో జెరార్డ్ బట్లర్ (బ్రోడీ టొరెన్స్), మైక్ కోల్టర్ (లూయిస్ గాస్పరే), యోసన్ ఆన్ (సామ్యూల్ డెలె), డానియెల్లా పినెడా (బోనీ), టోనీ గోల్డ్‌విన్ (స్కార్స్‌డేల్) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాని ప్రస్తుతం Prime Videoలో చూడవచ్చు.