Survival Thriller on OTT: కొండలను పేల్చి బొగ్గు తవ్వుతున్న ఓ మైనింగ్ కంపెనీ… ఆ నేలలో ఓ భయంకరమైన రహస్యం దాగుంది అన్న సంగతి తెలియదు. కానీ ఒక్క ప్రమాదం తర్వాత ఆ గని నుంచి బయటకు వచ్చిన ఓ ప్రాచీన రాక్షస జీవి ఆ ప్రాంతాన్ని వణికిస్తుంది. భర్త కనిపించకుండా పోవడం, కుటుంబం ప్రమాదంలో పడటం… వంటి పరిస్థితులతో చివరికి ఆ రాక్షసిని వేటాడాల్సిన సిట్యుయేషన్ ఓ తల్లికి వస్తే ? ఆ సర్వైవల్ పోరాటమే ‘డార్క్ హాలో’ (Dark Hollow – 2026)మ మూవీ. మరి ఆ తల్లి ఏం చేసిందో తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.
అప్పలాచియా పర్వత ప్రాంతంలోని ఓ చిన్న బొగ్గు గనుల పట్టణం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అక్కడి ప్రజల జీవితం మొత్తం మైనింగ్ పరిశ్రమపైనే ఆధారపడి ఉంటుంది. కానీ లాభాల కోసం స్థానిక మైనింగ్ కార్పొరేషన్ కొండలను పేల్చి మరీ బొగ్గును తవ్వుతుంటుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా బొగ్గు దుమ్ముతో నిండిపోతుంది. కాలుష్యం, అనారోగ్యం, పేదరికం… స్థానికుల జీవితాలను వెంటాడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు గని లోతుల్లో భారీ ప్రమాదం జరుగుతుంది. గని కొంత భాగం కూలిపోవడంతో పలువురు కార్మికులు చిక్కుకుపోతారు.
వారిలో కేసీ భర్త జెస్సీ కూడా ఉంటాడు. అయితే ఈ ప్రమాదం కేవలం గని కూలిపోవడంతోనే ఆగిపోదు. గని లోతుల్లో ఎన్నో ఏళ్లుగా దాగి ఉన్న ఓ ప్రాచీనమైన భయంకరమైన జీవి బయటకు వస్తుంది. ఆ రాక్షస జీవి బయటకు వచ్చిన తర్వాత పరిసర ప్రాంతాల్లో భయానక పరిస్థితులు మొదలవుతాయి. చీకటి గుహలు, దట్టమైన అడవులు దాని వేట స్థలాలుగా మారతాయి. మనుషులపై దాడులు మొదలవుతాయి. మరోవైపు భర్త ఏమయ్యాడో తెలియని కేసీకి తన కుటుంబాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది.
ఇక పోలీసుల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా.. కేసీ స్వయంగా ఆ రాక్షసిని వెతకాలని నిర్ణయించుకుంటుంది. భర్తను కాపాడుకోవడంతో పాటు తన ఇల్లు, కుటుంబాన్ని రక్షించుకోవాలంటే ఆ జీవిని అంతం చేయాల్సిందేనని భావిస్తుంది. దట్టమైన అడవులు, ప్రమాదకరమైన గుహలు, చీకటి గని మార్గాల్లో ఆమె సాగించే వేటే కథలో అసలు ఉత్కంఠ. చివరికి కేసీ ఆ ప్రాచీన జీవిని ఎలా ఎదుర్కొంది ? జెస్సీ ప్రాణాలతో బయటపడ్డాడా ? ఆ రాక్షసి అసలు గని లోతుల్లోకి ఎలా వచ్చింది ? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా ముగింపు.
‘డార్క్ హాలో’ ఇండీ క్రీచర్ హారర్ మూవీ. డేనియల్ బైయర్స్ (Daniel Byers) దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా రాశారు. జూన్ ష్రైనర్ (June Schreiner) కేసీగా, డేవిడ్ గారెలిక్ (David Garelik) జెస్సీగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Videoలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు ఆడియో లేదా తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో లేవు. ఇంగ్లీష్‌లోనే చూడాలి. క్రీచర్ హారర్, సర్వైవల్ థ్రిల్లర్ తరహా సినిమాలను ఇష్టపడేవారికి ‘డార్క్ హాలో’ మంచి ఆప్షన్.
Read Also: మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్