Spy Action Thriller Series: తొమ్మిదేళ్ల క్రితం తన మరణాన్ని తానే నకిలీగా సృష్టించుకుని ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయిన ఓ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి… ఇన్నేళ్ల తర్వాత తన కూతురే తనను వేటాడుతుందని తెలిస్తే ? పైగా ఆ కూతురు సాధారణ యువతి కాదు, ఓ ప్రైవేట్ గూఢచారి సంస్థ కోసం పని చేసే ప్రొఫెషనల్ అసాసిన్. తండ్రి గతం, కూతురి కోపం, వెనుక నుంచి వెంటాడే స్పై నెట్‌వర్క్… ఈ మూడింటి మధ్య సాగే యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘బటర్‌ఫ్లై’ (Butterfly). మరి ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అన్నది తెలుసుకుందాం.
డేవిడ్ జంగ్ ఓ మాజీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్. కొంతకాలంగా దక్షిణ కొరియాలో ఎవరికీ తెలియకుండా అజ్ఞాత జీవితం గడుపుతుంటాడు. తొమ్మిదేళ్ల క్రితం తన మరణాన్ని నకిలీగా సృష్టించుకుని అదృశ్యమైన అతడు… అప్పటి నుంచి తన గతానికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ గతంలో తీసుకున్న ఓ కీలక నిర్ణయానికి సంబంధించిన పరిణామాలు మళ్లీ అతడి జీవితంలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది.
డేవిడ్ ను అంతం చేయడానికి రంగంలోకి దిగుతుంది రెబెక్కా. ఆమె డేవిడ్ కూతురే అయినప్పటికీ… తండ్రితో ఉన్న అనుబంధం కంటే తనలో పేరుకుపోయిన కోపమే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆమె కాడిస్ అనే ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ కోసం పని చేసే ప్రమాదకరమైన అసాసిన్. సంస్థ నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం తన టార్గెట్ డేవిడ్ అని తెలుసుకున్న రెబెక్కా… అతడిని చంపేందుకు రంగంలోకి దిగుతుంది. ఒకప్పుడు తన జీవితంలో లేని తండ్రినే ఇప్పుడు వేటాడాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురవుతుంది.
అయితే డేవిడ్, రెబెక్కా ఎదురుపడిన తర్వాత కథ పూర్తిగా మరో మలుపు తిరుగుతుంది. కాడిస్ నుంచి తప్పించుకునే క్రమంలో తండ్రీకూతుళ్లు కలిసి పరుగులు తీయాల్సి వస్తుంది. రెబెక్కాలో తనను వదిలి వెళ్లిన తండ్రిపై ఉన్న కోపం ఇంకా అలాగే ఉంటుంది. డేవిడ్ మాత్రం ఆమెను ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని పూర్తిగా బయట పెట్టలేని పరిస్థితిలో ఉంటాడు. ఒకవైపు కాడిస్ వెంటాడుతుండగా… మరోవైపు తండ్రీకూతుళ్ల మధ్య ఎన్నేళ్లుగా ఉన్న దూరం, అపార్థాలు బయటపడతాయి.
తప్పించుకునే ప్రయాణంలో రెబెక్కా డేవిడ్ కొత్త కుటుంబాన్ని కూడా కలుస్తుంది. దీంతో ఆమె మనసులోని పాత గాయాలు మరింత రగులుతాయి. ఇదే సమయంలో కాడిస్ కు చెందిన జూనో వీళ్ల వెంట పడుతుంది. డేవిడ్ గతంతో జూనోకు ఉన్న సంబంధం కూడా బయటపడటంతో కథ మరింత కష్టంగా మారుతుంది. చివరకు డేవిడ్, రెబెక్కా కేవలం తప్పించుకోవడం మాత్రమే కాకుండా… కాడిస్ వ్యవస్థనే దెబ్బతీయడానికి కలిసి ప్లాన్ చేసే పరిస్థితి వస్తుంది.
డేవిడ్ తొమ్మిదేళ్ల క్రితం తన మరణాన్ని ఎందుకు నాటకం ఆడాల్సి వచ్చింది ? రెబెక్కాను వదిలి వెళ్లడానికి అసలు కారణం ఏంటి ? కాడిస్ తో అతడికి ఉన్న పాత సంబంధం ఎంత ప్రమాదకరం ? తనను చంపేందుకు వచ్చిన కూతురినే డేవిడ్ ఎలా తనవైపు తిప్పుకున్నాడు ? చివరకు జూనో, కాడిస్ నుంచి తండ్రీకూతుళ్లు బయట పడగలరా ? వాళ్ల మధ్య దూరానికి అసలు ముగింపు ఎలా పడుతుందనేదే ‘బటర్‌ఫ్లై’లో ఉత్కంఠను పెంచే అంశం.
డేనియల్ డే కిమ్ (Daniel Dae Kim), రైనా హార్డెస్టీ (Reina Hardesty), లూయిస్ లాండౌ (Louis Landau), పైపర్ పెరాబో (Piper Perabo), పార్క్ హే-సూ (Park Hae-soo), కిమ్ జీ-హూన్ (Kim Ji-hoon) తదితరులు నటించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌కు కిటావో సకురాయ్ (Kitao Sakurai), కిమ్ జిన్-మిన్ (Kim Jin Min), జాన్ టర్నర్ (Jann Turner) దర్శకత్వం వహించారు. 2025లో విడుదలైన ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం ‘బటర్‌ఫ్లై’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోతో పాటు తెలుగు సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ స్పై థ్రిల్లర్‌ను తెలుగులో కూడా చూడొచ్చు.
Read Also: జైలులో ఉన్న ఖైదీకి ఓ ఒంటరి తల్లి లేఖలు… కట్ చేస్తే మతిపోగొట్టే ట్విస్ట్… ఈ ఎమోషనల్ మూవీ తెలుగులోనే