Psychological Thriller on OTT: డబ్బుకు కొదవ లేదు… విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన దుస్తులు, బయట ప్రపంచంతో పెద్దగా సంబంధం లేని కుటుంబం. చూస్తే వాళ్లది పర్ఫెక్ట్ లైఫ్‌లా అనిపిస్తుంది. కానీ ఆ ఇంట్లోకి ఓ కొత్త వ్యక్తి అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడే నిజాలు మాత్రం భయపెట్టేలా ఉంటాయి. ప్రేమ, ఆస్తి, ఆధిపత్యం, కుటుంబ రహస్యాలు ఒకదానితో ఒకటి ఢీకొంటే ఏం జరుగుతుంది ? బయటకు పర్ఫెక్ట్‌గా కనిపించే కుటుంబం లోపలే ప్రమాదకరంగా మారితే ? ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన డార్క్ కామెడీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘Rosebush Pruning’. మరి ఈ కుటుంబం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి ? సినిమా ఏ ఓటీటీలో ఉంది ? అనేది తెలుసుకుందాం.
స్పెయిన్ లోని కాటలోనియాలో ఓ విలాసవంతమైన ఇంట్లో సంపన్న అమెరికన్ కుటుంబం జీవిస్తుంటుంది. జాక్, ఎడ్, అన్నా, రాబర్ట్ అనే నలుగురు తోబుట్టువులు… వారి చూపులేని తండ్రి కలిసి ఉంటారు. వారసత్వంగా వచ్చిన అపారమైన సంపద, విలాసాలు ఉన్నా… కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ప్రేమ కంటే ఆధిపత్యం, అసూయ, అనుమానాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కుటుంబంలోకి జాక్ తన గర్ల్‌ఫ్రెండ్ మార్తాను తీసుకురావడంతో పరిస్థితులు మారిపోతాయి.
ఇన్నాళ్లు తమ మధ్యే కొనసాగిన కుటుంబ ప్రపంచంలోకి ఓ బయటి వ్యక్తి రావడంతో, దాచిపెట్టిన సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయట పడతాయి. జాక్ తన కుటుంబానికి దూరంగా వెళ్లాలని ప్రయత్నించే కొద్దీ, అతని తోబుట్టువుల్లో అసూయ, అసహనం పెరుగుతాయి. ఇదే సమయంలో ఎడ్‌కు తన తల్లి మరణంపై అనుమానాలు మొదలవుతాయి. కుటుంబం చెప్పినట్లు ఆమె నిజంగానే తోడేళ్ల దాడిలో చనిపోయిందా ? లేక ఆ మరణం వెనుక మరేదైనా భయంకరమైన రహస్యం ఉందా ? అనే ప్రశ్నతో ఎడ్ గతాన్ని వెతకడం మొదలుపెడతాడు. అతను నిజాన్ని తెలుసుకునే కొద్దీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అసలు సంబంధాలు బయట పడతాయి.
ఆస్తి, వారసత్వం, ప్రేమ, అసూయ, కుటుంబ ఆధిపత్యం అన్నీ కలిసిపోవడంతో ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతారు. బయటకు మాత్రం పర్ఫెక్ట్ కుటుంబంలా కనిపించే వీళ్ల జీవితాల్లో ఎంతటి చీకటి దాగి ఉందో కథలో చూపించే విధానం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. చివరికి కుటుంబాన్ని కలిపి ఉంచింది ప్రేమేనా ? లేక డబ్బు, భయమేనా ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నదే సినిమాలో చూసి తెలుసుకోవాల్సిన అసలైన కథ.
కరీమ్ ఐనౌజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్యాలమ్ టర్నర్, రైలీ కియో, ఎల్లే ఫానింగ్, జేమీ బెల్, పమేలా ఆండర్సన్ తదితరులు నటించారు. ‘Dogtooth’ రచయిత ఎఫ్తిమిస్ ఫిలిప్పౌ స్క్రీన్‌ప్లే అందించారు. డార్క్ కామెడీ, సైకలాజికల్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామాను కలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తుతం MUBIలో అందుబాటులో ఉంది. భారతదేశంలో MUBI Amazon Channel ద్వారా కూడా లిస్టింగ్ ఉంది. సినిమా నిడివి సుమారు 95 నిమిషాలు ఉంటుంది. కానీ తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. డబ్బు, కుటుంబ రహస్యాలు, వారసత్వం, మానసిక ఆటలతో కూడిన డిఫరెంట్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
Read Also: పిల్లాడు చెప్పే చిన్న అబద్ధం… ఏలియన్స్ ఎంట్రీతో భారీ సమస్య… ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ కేక