Korean Horror Thriller: సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆశ ఎంత దూరానికైనా తీసుకెళ్తుంది. కానీ అదే ప్రయత్నం ప్రాణాల మీదకు తెస్తే ? దెయ్యాలు తిరుగుతాయనే ప్రచారంలో ఉన్న ఓ రైల్వే స్టేషన్‌లో వీడియో తీయడానికి వెళ్లిన ఓ హారర్ యూట్యూబర్ జీవితమే ఊహించని మలుపు తిరుగుతుంది. అక్కడ జరిగిన ప్రతి సంఘటన ఆమెను భయంతో వణికిస్తూనే, ప్రేక్షకులను కూడా ఉత్కంఠలో ముంచెత్తుతుంది. ఆ కొరియన్ మిస్టరీ హారర్ చిత్రమే ‘Ghost Train’. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
దా-క్యుంగ్ అనే యువతి హారర్ వీడియోలు చేసే యూట్యూబర్. ఒకప్పుడు ఆమె వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చేవి. కానీ క్రమంగా ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోవడంతో ఆమె ఛానెల్ కూడా వెనుకబడిపోతుంది. ఎలాగైనా మరోసారి వైరల్ కావాలని నిర్ణయించుకున్న ఆమె, అందరూ భయపడే ఒక నిజమైన హాంటెడ్ ప్రదేశంలో వీడియో తీయాలని ప్లాన్ చేస్తుంది. అప్పుడే వరుస అదృశ్యాలు, వింత మరణాలు, దెయ్యాల కథలతో వార్తల్లో నిలిచిన గ్వాంగ్లిమ్ సబ్‌వే రైల్వే స్టేషన్ గురించి ఆమెకు తెలుస్తుంది. ఆ స్టేషన్‌లోకి వెళ్లిన కొందరు తిరిగి రాలేదని, అక్కడ రాత్రి వేళల్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని, కనిపించకూడని నీడలు కనిపిస్తాయని ఎన్నో కథలు ప్రచారంలో ఉంటాయి.
ఇదే తన ఛానెల్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తుందని భావించిన దా-క్యుంగ్ కెమెరాతో ఒంటరిగా అక్కడికి చేరుకుంటుంది. స్టేషన్‌లో పని చేస్తున్న స్టేషన్ మాస్టర్‌ను కలిసి అక్కడ జరిగిన సంఘటనల గురించి అడగగా, మొదట మాట్లాడేందుకు ఇష్టపడని అతను తర్వాత ఆ స్టేషన్‌లో జరిగిన నాలుగు భయంకరమైన కథలను ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభిస్తాడు. టన్నెల్‌లోకి వెళ్లి అదృశ్యమైన ప్రయాణికులు… ఎవరూ లేకపోయినా వినిపించే అడుగుల శబ్దాలు… ప్లాట్‌ఫారమ్‌పై కనిపించే వింత ఆకారాలు… అర్థంకాని మరణాలు… ఒక్కో కథ వింటున్న కొద్దీ దా-క్యుంగ్‌లో భయం పెరుగుతుంది.
అయితే అవన్నీ కేవలం కథలేనని భావించిన ఆమె, అసలు నిజం తెలుసుకోవాలని కెమెరా ఆన్ చేసి స్టేషన్‌లోని నిషేధిత ప్రాంతాల్లోకి అడుగు పెడుతుంది. అక్కడి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కెమెరాలో రికార్డ్ అవుతున్న దృశ్యాలు, చీకటిలో కనిపించే నీడలు, వినిపించే వింత శబ్దాలు ఆమెను వెంటాడడం మొదలవుతుంది. వ్యూస్ కోసం ప్రారంభమైన ప్రయాణం చివరకు ప్రాణాల కోసం చేసే పోరాటంగా మారిపోతుంది.
చివరికి దా-క్యుంగ్ ఆ భయంకరమైన స్టేషన్ నుంచి ప్రాణాలతో బయటపడిందా ? స్టేషన్ మాస్టర్ చెప్పిన కథల వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి ? ఆ స్టేషన్‌లో అదృశ్యమైన వారి రహస్యం బయటపడిందా ? లేక ఆమె కూడా ఆ చీకటిలో కలిసిపోయిందా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
కొరియన్ మిస్టరీ హారర్ చిత్రం ‘ఘోస్ట్ ట్రైన్’లో జూ హ్యూన్-యంగ్ ప్రధాన పాత్రలో నటించగా, జెయోన్ బే-సూ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Video ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్‌తో పాటు ఒరిజినల్ కొరియన్ భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ మూవీ లవర్స్ కు ఈ సినిమాతో పండగే. వీకెండ్‌లో ఒక ఉత్కంఠభరితమైన హారర్ మూవీ చూడాలనుకుంటే ‘ఘోస్ట్ ట్రైన్’ను మిస్ అవ్వొద్దు.
Read Also: డ్యాన్స్ చేస్తూ గ్యాంగ్‌స్టర్లను చితగ్గొట్టే అమ్మాయిలు… ఈ థ్రిల్లర్ నెక్స్ట్ లెవెల్