Horror Comedy: హారర్ సినిమాలు అంటే భయం, థ్రిల్లింగ్ సన్నివేశాలు గుర్తొస్తాయి. కానీ అదే హారర్‌కు కామెడీని జోడించి, ప్రేక్షకుడినే సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లే కథ వస్తే ఎలా ఉంటుంది ? అలాంటి విభిన్నమైన ఆలోచనతో తెరకెక్కిన చిత్రమే ‘ది ఫైనల్ గర్ల్స్ (The Final Girls)’. 80వ దశకంలోని స్లాషర్ హారర్ సినిమాలను సరదాగా ఆటపట్టిస్తూ, అదే సమయంలో భావోద్వేగాలు, నవ్వులు కలగపిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టనివ్వదు. మరి సినిమాలోకి వెళ్లిపోయిన ఆ యువకులు బయటకు ఎలా వచ్చారు ? అసలు అక్కడ ఏం జరిగింది ? సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.
కాలేజ్ విద్యార్థిని మాక్స్ తన తల్లిని చిన్నప్పుడే కోల్పోతుంది. ఆమె తల్లి ఒకప్పుడు ‘క్యాంప్ బ్లడ్‌బాత్’ అనే హారర్ సినిమాలో నటించి ఉంటుంది. ఆ సినిమా స్పెషల్ ప్రీమియర్ జరుగుతుండటంతో మాక్స్ తన స్నేహితులతో కలిసి థియేటర్‌కు వెళ్తుంది. అయితే సినిమా నడుస్తున్న సమయంలో థియేటర్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరుగుతుంది. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసిన మాక్స్, ఆమె స్నేహితులు తెరను చించుకుని వెనుకవైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.
కానీ కళ్లుతెరిచి చూసేసరికి వాళ్లు నిజంగానే ఆ సినిమా ప్రపంచంలోకి వెళ్లిపోయినట్లు గ్రహించి షాక్ అవుతారు. అక్కడ జరిగే ప్రతి సంఘటన ముందే రాసిన సినిమా కథ ప్రకారమే సాగుతుంది. పాత్రలు అదే డైలాగులు చెబుతుంటాయి. అదే సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతుంటాయి. ఈ విషయం అర్థమైన తర్వాత మాక్స్ తన తల్లి పాత్రను ఈసారి ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకుంటుంది.
కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే సినిమాలో ముసుగు ధరించిన ఒక ప్రమాదకరమైన హంతకుడు ఒక్కొక్కరిని వెంబడిస్తూ చంపేస్తుంటాడు. అతని నుంచి తప్పించుకోవడమే కాదు… సినిమా కథనే మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ మొదలైతే ప్రపంచం మొత్తం నలుపు-తెలుపుగా మారిపోవడం, పాత్రలు ఒక్కసారిగా నెమ్మదిగా కదలడం, ఎవరూ ఊహించని విధంగా సినిమా నియమాలు పనిచేయడం నవ్వులు పంచుతూనే ఆశ్చర్యానికి గురిచేస్తాయి. హారర్ సినిమాల్లో ఉండే భయాన్ని సరదాగా చూపించిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. చివరికి మాక్స్ తన తల్లి ప్రాణాలను కాపాడగలిగిందా ? సినిమా కథను మార్చగలిగారా ? ఆ హంతకుడిని ఎవరు ఆపారు ? సినిమాలో చిక్కుకున్న వాళ్లు నిజ జీవితంలోకి తిరిగి వచ్చారా ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
‘ది ఫైనల్ గర్ల్స్’ సినిమాలో తైస్సా ఫార్మిగా, మాలిన్ అకెర్మాన్, అలెగ్జాండర్ లుడ్విగ్, నినా డోబ్రెవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి టాడ్ స్ట్రాస్-షుల్సన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు ఆడియో అందుబాటులో లేదు. హారర్ సినిమాలను కొత్త కోణంలో చూడాలనుకునే వారికి, భయంతో పాటు నవ్వులు కూడా కావాలనుకునే వారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు. ఒకసారి ఈ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాక, చివరి వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం తగ్గదు.
Read Also: పోలీస్ అధికారి రాసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?