Horror Thriller: ఓ తండ్రి, కూతురు కలిసి ప్రయాణిస్తుండగా అనుకోకుండా ఓ యూనికార్న్ ను కారుతో ఢీకొట్టి చంపేస్తారు. అక్కడితో సమస్య ముగిసిపోయింది అనుకుంటే… ఆ అరుదైన జీవి శరీరంలో ఉన్న శక్తుల గురించి తెలిసిన తర్వాత అసలు రచ్చ మొదలవుతుంది. దానికి ప్రాణాలు కాపాడే అద్భుతమైన శక్తి ఉందని తెలుసుకున్న ఓ సంపన్న కుటుంబం, ఆ యూనికార్న్ ను ప్రకృతి అద్భుతంగా కాకుండా కోట్ల విలువైన వస్తువుగా చూడటం మొదలు పెడుతుంది. దాని రక్తం, కొమ్ములు తమకు ఏం చేయగలవో తెలుసుకునే కొద్దీ ఆశ మరింత పెరుగుతుంది. చివరికి ఓ యూనికార్న్ మరణం… మనుషులలో దాగి ఉన్న అత్యాశను బయటకు తీసుకొచ్చే పరిస్థితికి దారితీస్తుంది. ఇదే ‘డెత్ ఆఫ్ ఎ యూనికార్న్’ (Death of a Unicorn) కథ. మరి ఈ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.
ఇలియట్ తన కూతురు రిడ్లీతో కలిసి ఓ ప్రయాణంలో ఉంటాడు. మార్గమధ్యలో వాళ్ల కారు ఓ యూనికార్న్ ను ఢీకొంటుంది. జరిగిన ప్రమాదంతో ఆ జీవి చనిపోతుంది. మొదట ఈ ఘటనను ఎలా ఎదుర్కోవాలో తెలియక తండ్రీకూతుళ్లు అయోమయంలో పడతారు. అయితే ఆ యూనికార్న్ సాధారణ జీవి కాదని, దాని శరీరంలో అసాధారణమైన వైద్య గుణాలు ఉన్నాయని తెలిసిన తర్వాత పరిస్థితి మారిపోతుంది.
ఇలియట్ పని చేసే బిలియనీర్ బాస్ డెల్ లియోపోల్డ్ కుటుంబానికి ఈ విషయం చేరుతుంది. అనారోగ్యాలతో బాధ పడుతున్న ఆ కుటుంబానికి యూనికార్న్ శరీరం ఓ అద్భుతమైన అవకాశంలా కనిపిస్తుంది. ముఖ్యంగా దాని రక్తం, కొమ్ముల్లో ఉన్న శక్తిని ఉపయోగించుకుని వ్యాధులను నయం చేయవచ్చనే ఆశ పెరుగుతుంది. అక్కడి నుంచి ఆ జీవిని పరిశోధన కోసం ఉపయోగించాలనే ప్రయత్నాలు మొదలవుతాయి. కానీ ప్రకృతిని తమ స్వార్థం కోసం ఉపయోగించాలనే ప్రయత్నానికి ప్రతిఫలం లేకుండా పోదు.
యూనికార్న్ కు సంబంధించిన మరిన్ని రహస్యాలు బయట పడుతున్న కొద్దీ అక్కడి మనుషుల మధ్య నమ్మకం తగ్గిపోతుంది. డబ్బు, అధికారం, అమరత్వం లాంటి ఆశలు ఒక్కొక్కరిలో ఒక్కో రాక్షసుడిని బయటకు తీస్తాయి. రిడ్లీ మాత్రం జరుగుతున్న పరిణామాలను మరో కోణంలో చూస్తుంది. తాము చేసిన ప్రమాదం నుంచి మొదలైన విషయం ఇంత పెద్ద ప్రమాదంగా మారుతుందని ఆమె ఊహించదు. తండ్రీకూతుళ్లను చుట్టుముట్టే ప్రమాదం పెరుగుతున్న కొద్దీ ఈ ఫాంటసీ కథలో హారర్, బ్లాక్ కామెడీ, థ్రిల్ మరింత పెరుగుతాయి. మరి చివరికి కథలో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
పాల్ రడ్ (Paul Rudd), జెన్నా ఒర్టేగా (Jenna Ortega), విల్ పౌల్టర్, రిచర్డ్ ఈ. గ్రాంట్ నటించిన ‘డెత్ ఆఫ్ ఎ యూనికార్న్’కు అలెక్స్ షార్ఫ్‌మన్ (Alex Scharfman) దర్శకత్వం వహించారు. ఇది హారర్, కామెడీ, ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన సినిమా. సెప్టెంబర్ 28 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి ఈ సినిమాను డోంట్ మిస్.
Read Also: కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్