Korean Action Thriller Series: బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థిని ఒక్క పంచ్‌తో పడగొట్టే ఇద్దరు యువకులు… అదే పిడికిళ్లతో ఓ క్రూరమైన మాఫియా సామ్రాజ్యాన్నే ఢీకొంటే ? డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనుకాడని లోన్ షార్క్ గ్యాంగ్‌కు ఎదురుగా ఆయుధాలు లేకుండా ఇద్దరు బాక్సర్లు నిలబడితే ? కుటుంబాన్ని కాపాడుకోవాలనే లక్ష్యం, స్నేహితుడిపై నమ్మకం, గుండెల్లో కోపం… ఇవన్నీ కలిసి వారి పోరాటాన్ని మరింత ప్రమాదకరంగా మార్చితే ? అలాంటి రా యాక్షన్, మాఫియా క్రైమ్ కలగలిసిన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘బ్లడ్‌హౌండ్స్’ (Bloodhounds). ఊపిరి సలపనివ్వని ఫైట్ సీన్లు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సిరీస్ ను ఏ ఓటీటీ ఉంది ? కథ ఏంటి ? అన్న విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
గున్-వూ, వూ-జిన్ ఇద్దరూ బాక్సింగ్‌పై ప్రాణం పెట్టే యువకులు. మొదట రింగ్‌లో ప్రత్యర్థులుగా తలపడిన వీరిద్దరూ… ఆ తర్వాత ఒకరి బలాన్ని మరొకరు గుర్తించి మంచి స్నేహితులుగా మారతారు. బాక్సింగ్‌లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటున్న వీరి జీవితాల్లోకి అనుకోని సమస్యలు రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి.
గున్-వూ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో అతని తల్లి అప్పుల భారంతో సతమతమవుతుంది. ఆమె పరిస్థితిని ఆసరాగా చేసుకున్న క్రూరమైన లోన్ షార్క్ మియోంగ్-గిల్ తన అసలు రంగును బయటపెడతాడు. అప్పుల పేరుతో కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడంతో, గున్-వూ తన తల్లిని ఆ సమస్య నుంచి బయటపడేయాలని నిర్ణయించుకుంటాడు.
ఈ పరిస్థితుల్లో వూ-జిన్ కూడా తన స్నేహితుడిని ఒంటరిగా వదిలిపెట్టడు. బాక్సింగ్ కెరీర్‌ను పక్కన పెట్టి గున్-వూతో కలిసి ఈ ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అప్పటి వరకు రింగ్‌లో ప్రత్యర్థులను ఎదుర్కొన్న ఈ ఇద్దరూ… ఇప్పుడు నిజ జీవితంలో ప్రాణాంతకమైన గ్యాంగ్‌స్టర్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మియోంగ్-గిల్ నడిపించే లోన్ షార్క్ సామ్రాజ్యం సాధారణ గ్యాంగ్ కాదు. డబ్బు, పలుకుబడి, బలగం… అన్నింటినీ ఉపయోగించుకుని తనకు ఎదురొచ్చిన వారిని భయపెట్టే స్థాయిలో అతని నెట్‌వర్క్ ఉంటుంది. అలాంటి శక్తివంతమైన వ్యక్తిని ఎదుర్కొనేందుకు గున్-వూ, వూ-జిన్ దగ్గర పెద్ద గ్యాంగ్ కానీ, ఆధునిక ఆయుధాలు కానీ ఉండవు. వారి దగ్గర ఉన్న అసలైన ఆయుధం మాత్రం బాక్సింగ్‌తో పదునెక్కిన శారీరక సామర్థ్యం, వేగం, పంచ్ పవర్… ముఖ్యంగా ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకం.
మాఫియా గ్యాంగ్‌స్టర్లతో ఒక్కోసారి ఎదురుపడే కొద్దీ వీరి పోరాటం మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఒక్క ఫైట్ ముగిసేలోపే మరో సమస్య ఎదురవుతుంది. గాయపడినా వెనక్కి తగ్గకుండా, తమను నమ్ముకున్నవారిని కాపాడేందుకు ఇద్దరూ కలిసి పోరాడుతుంటారు. దీంతో కథలో యాక్షన్‌తో పాటు వారి స్నేహం కూడా ప్రధాన ఆకర్షణగా మారుతుంది. మరోవైపు మియోంగ్-గిల్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు మరింత క్రూరంగా మారతాడు. గున్-వూ, వూ-జిన్ తనకు ఎదురుగా నిలబడటాన్ని అతను సవాల్‌గా తీసుకుంటాడు. దీంతో ఈ ఇద్దరు యువకులపై ప్రమాదం మరింత పెరుగుతుంది. ఒక తప్పు నిర్ణయం వారి ప్రాణాలకే ముప్పుగా మారే పరిస్థితులు ఎదురవుతాయి.
అయినా కుటుంబం కోసం మొదలైన ఈ పోరాటం క్రమంగా ప్రతీకారంగా మారుతుంది. మియోంగ్-గిల్ సామ్రాజ్యం ఎంత పెద్దది? అతని వెనుక ఉన్న అసలు బలం ఏంటి? ఆ నెట్‌వర్క్‌ను ఎదుర్కొనే క్రమంలో గున్-వూ, వూ-జిన్ ఎలాంటి నష్టాలను చవిచూశారు? చివరకు ఈ ఇద్దరు బాక్సర్లు మాఫియా సామ్రాజ్యాన్ని ఎంతవరకు కూల్చగలిగారు? అనేదే సిరీస్‌లో అసలు కథ.
వూ దో-హ్వాన్, లీ సాంగ్-యి, పార్క్ సుంగ్-వూంగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు కిమ్ జూ-హ్వాన్ దర్శకత్వం వహించారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌కు మాఫియా క్రైమ్, రివెంజ్, ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి కథను నడిపించారు. ‘బ్లడ్‌హౌండ్స్’కు ప్రధాన బలం దాని రా యాక్షన్, ఫైట్ కొరియోగ్రఫీ. హీరోలు సూపర్‌హీరోల్లా కాకుండా తమ శారీరక సామర్థ్యాన్ని ఉపయోగించుకుని ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఫైట్స్‌కు మరింత సహజమైన ఫీల్ ఇస్తుంది. దానికి తోడు ఇద్దరు స్నేహితుల మధ్య బాండింగ్, కుటుంబం కోసం చేసే పోరాటం, మాఫియా ప్రపంచంలోని క్రూరత్వం కథకు ఎమోషనల్ బలం ఇస్తాయి. యాక్షన్, మాఫియా క్రైమ్, రివెంజ్ కథలు ఇష్టపడేవారికి ఇది వర్త్ వాచింగ్ మూవీ. మూవీ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ భాషలో రూపొందిన ఈ సిరీస్ తెలుగులో లేదు. ఒకవైపు భారీ మాఫియా సామ్రాజ్యం.. మరోవైపు ఇద్దరు యువ బాక్సర్లు. చేతిలో ఆయుధాలు లేకపోయినా, తమ పిడికిళ్లను నమ్ముకుని శత్రువుల సామ్రాజ్యాన్నే ఢీకొట్టే వీరి ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు యాక్షన్‌తో నింపేస్తుంది.
Read Also: హాలీవుడ్‌ను ఏలిన మినియన్స్… రాక్షసులను దించి ప్రపంచాన్నే డేంజర్లో పడేసే బొమ్మలు