Korean Romantic Drama: పదేళ్లుగా ప్రేమలో ఉన్న జంటకు పెళ్లి చేసుకోవడం సహజమైన తదుపరి అడుగేనా ? ఒకప్పుడు ఎంతో గాఢంగా ఉన్న ప్రేమే… కాలంతో పాటు కేవలం అలవాటుగా మారితే ఏం జరుగుతుంది ? కెరీర్ లో ఎదురైన వరుస వైఫల్యాలు ఓ మహిళ మనసును మార్చేస్తే… అదే సమయంలో ఆమె జీవితంలోకి మరో వ్యక్తి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? పదేళ్ల బంధాన్ని కాపాడుకోవాలా ? లేక కొత్తగా కలిగిన ఆకర్షణకు విలువ ఇవ్వాలా ? ఇలాంటి ప్రశ్నల చుట్టూ తిరిగే కొరియన్ రొమాంటిక్ మెలో డ్రామానే ‘ఎ లవ్ అదర్ దాన్ యువర్స్’ (A Love Other Than Yours). మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అన్నది తెలుసుకోవాలంటే ముందు స్టోరీలోకి వెళ్దాం.
నామ్‌గుంగ్ హో, లీ మి-దో పదేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట. హో కార్పొరేట్ కంపెనీలో సెక్షన్ చీఫ్ గా పని చేస్తుంటాడు. మనసులో ఉన్నది సూటిగా చెప్పే అతని స్వభావం చాలా సింపుల్ గా ఉంటుంది. తనతో ఇంతకాలం కలిసి ఉన్న మి-దోను పెళ్లి చేసుకుని జీవితాన్ని మరో దశలోకి తీసుకెళ్లాలని అతను భావిస్తుంటాడు. మి-దో మాత్రం ప్రతిభావంతురాలైన ఫిల్మ్ డైరెక్టర్. అయితే వరుస ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆమె కెరీర్ పై అనిశ్చితి పెరుగుతుంది. ఒకవైపు వయసు 30వ పడిలోకి రావడం, మరోవైపు తల్లి నుంచి పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి… వీటన్నింటి మధ్య ఆమెకు తన జీవితంపైనే సందేహాలు మొదలవుతాయి.
ఇంతకాలం బలంగా కనిపించిన ప్రేమలో కూడా చిన్న చిన్న పగుళ్లు కనిపించడం మొదలవుతుంది. అలాంటి సమయంలో మి-దో జీవితంలోకి మరో వ్యక్తి వస్తాడు. తన కెరీర్ లో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో అతని పరిచయం ఆమె భావోద్వేగాలను కదిలిస్తుంది. ఇంతకాలం తనకు ఉన్న బంధం నిజంగా ప్రేమేనా ? లేక కేవలం అలవాటుగా మారిపోయిందా ? అనే ప్రశ్న ఆమెను వెంటాడుతుంది. మి-దోలో వస్తున్న మార్పును హో కూడా గమనిస్తాడు.
ఆమె దూరమవుతున్న కొద్దీ అతని మనసులో అసూయ, భయం, కోపం పెరుగుతాయి. అదే సమయంలో ఆమెను తన జీవితంలోనే ఉంచుకోవాలనే ఉద్దేశంతో అతను ఊహించని ఓ ప్రతిపాదన చేస్తాడు. అక్కడి నుంచి వీరిద్దరి బంధం మరింత సంక్లిష్టంగా మారుతుంది. కొత్త ఆకర్షణలు, పాత జ్ఞాపకాలు, ప్రేమ, అసూయ మధ్య చివరకు ఈ పదేళ్ల జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? పెళ్లి చేసుకుని తమ బంధాన్ని కొనసాగించారా ? లేక తమవి కాని ఇతర ప్రేమల వైపు అడుగులు వేశారా ? అన్నదే సిరీస్ లో ఆసక్తికరమైన అంశం.
‘ఎ లవ్ అదర్ దాన్ యువర్స్’ ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగులో డబ్బింగ్ అందుబాటులో లేదు. కొరియన్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడాలి. ప్రేమ, రిలేషన్‌షిప్స్ లో వచ్చే భావోద్వేగ సంఘర్షణలు, వాస్తవికమైన మలుపులు ఇష్టపడేవారికి ఈ సిరీస్ మంచి ఛాయిస్. కాబట్టి కొరియన్ మూవీ లవర్స్ డోంట్ మిస్.
Read Also: స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ