Korean Sci-Fi Mystery Thriller: చనిపోయిన మనిషి మెదడులో ఉన్న జ్ఞాపకాలను మనం చూడగలిగితే ఎలా ఉంటుంది ? ఓ శాస్త్రవేత్త అలాంటి ప్రయోగాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తాడు. తన కుటుంబానికి జరిగిన విషాదానికి సమాధానం వెతికే క్రమంలో అతనే తన ప్రయోగానికి తనను తాను త్యాగం వ్యక్తిగా మారతాడు. చనిపోయిన వారి మెదళ్లతో తన మెదడును అనుసంధానం చేస్తూ వెళ్లే కొద్దీ ఇతరుల జ్ఞాపకాలు మాత్రమే కాదు… వాళ్ల భావాలు, అలవాట్లు కూడా తనలోకి వస్తాయి. చివరకు తాను వెతుకుతున్న నిజం తన ఊహకంటే చాలా ప్రమాదకరమైనదని అతనికి తెలుస్తుంది. ఇలాంటి కథతో తెరకెక్కిన సిరీస్ ‘డాక్టర్ బ్రెయిన్’ (Dr. Brain). మరి ఈ మిస్టరీ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…
కోహ్ సెవోన్ చిన్నప్పటి నుంచే అసాధారణమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి. మానవ మెదడు ఎలా పని చేస్తుందనే దానిపై అతనికి అపారమైన ఆసక్తి ఉంటుంది. పెద్దయ్యాక బ్రెయిన్ సైంటిస్ట్ గా మారి మనుషుల చైతన్యం, జ్ఞాపకాలను అర్థం చేసుకునే సాంకేతికతపై పరిశోధనలు చేస్తుంటాడు. సెవోన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న తర్వాత అతని పరిశోధన కొత్త దిశలోకి మలుపు తిరుగుతుంది. తన కొడుకు డోయూన్ చనిపోయాడని భావించే పరిస్థితి ఏర్పడుతుంది. భార్య జేయీ కూడా డేంజరస్ సిట్యుయేషన్ లోకి వెళ్తుంది. తన కుటుంబానికి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి సెవోన్ కు నార్మల్ దర్యాప్తు సరిపోదని అనిపిస్తుంది.
అందుకే అతను అభివృద్ధి చేస్తున్న ‘బ్రెయిన్ సింక్’ టెక్నాలజీని ఉపయోగించి ఇతరుల మెదళ్లలోని జ్ఞాపకాలను తన మెదడుతో అనుసంధానం చేయాలని నిర్ణయించుకుంటాడు. మొదట ప్రయోగాలు ఇతర మార్గాల్లో సాగినా, కుటుంబ రహస్యం తెలుసుకోవడానికి చివరకు మృతదేహాల మెదళ్లతోనే సింక్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ ప్రయోగానికి తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి. సెవోన్ మరొకరి మెదడుతో సింక్ అయినప్పుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు… ఆ వ్యక్తి భావాలు, అలవాట్లు, కొన్ని ప్రవర్తనా లక్షణాలు కూడా అతనిలోకి వస్తాయి. దీంతో తనకు చెందిన జ్ఞాపకాలు, ఇతరుల జ్ఞాపకాలు మధ్య తేడా గుర్తించడం కష్టమవుతుంది.
తన కుటుంబం విషయంలో దాగి ఉన్న నిజాన్ని వెతుకుతున్న సెవోన్ కు ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ కాంగ్మూ లీ, డిటెక్టివ్ చోయ్ వంటి వ్యక్తులు ఎదురవుతారు. పోలీసులు కూడా అతని చుట్టూ జరుగుతున్న ఘటనలను అనుమానాస్పదంగా చూస్తారు. ప్రతి బ్రెయిన్ సింక్ తర్వాత సెవోన్ కు కొత్త క్లూ దొరుకుతుంది. అదే సమయంలో అతని మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఒకరి జ్ఞాపకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ మరో వ్యక్తి జీవితాన్ని తనలో మోసుకెళ్లాల్సి వస్తుంది. చివరకు తన కుటుంబానికి జరిగిన ఘటన వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు సెవోన్ చేసే పోరాటమే సిరీస్ లో ప్రధాన ఉత్కంఠ. మరి ఇంతకీ అతని కుటుంబానికి అసలేం జరిగింది ? దాన్ని అతను ఎలా తెలుసుకున్నాడు ? ఆ బ్రెయిన్ సింక్ వల్ల ఎలాంటి కష్టాలు వచ్చాయి ? అన్నది కథలో చూడాల్సిన అంశం.
ఈ సిరీస్ లో లీ సన్-క్యున్ (Lee Sun-kyun), పార్క్ హీ-సూన్ (Park Hee-soon), లీ యూ-యంగ్ (Lee Yoo-young), సియో జీ-హే (Seo Ji-hye) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కొరియన్ సిరీస్‌కు కిమ్ జీ-వూన్ (Kim Jee-woon) దర్శకత్వం వహించారు. ప్రస్తుతం Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.
Read Also: రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్