Psychological Survival Thriller: ఒక రొమాంటిక్ వెడ్డింగ్ యానివర్సరీ ట్రిప్… మరుసటి ఉదయం జీవితాన్నే మార్చేసే భయంకరమైన షాక్. చేతికి వేసిన సంకెళ్లను తీసుకునే అవకాశం లేదు. పక్కనే భర్త శవం. బయట గడ్డకట్టే మంచు తుఫాను. అదే సమయంలో ఇద్దరు కిరాతక హంతకులు ఆ ఇంట్లోకి అడుగు పెడతారు. ఇలాంటి గుండెల్లో దడ పుట్టించే కథతో తెరకెక్కిన హాలీవుడ్ సైకాలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ ‘Till Death’. తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఎమ్మా తన భర్త మార్క్‌తో కలిసి మ్యారేజ్ యానివర్సరీని జరుపుకోవడానికి నగరానికి దూరంగా ఉన్న మంచు సరస్సు ఒడ్డున ఉన్న విల్లాకు వెళ్తుంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నప్పటికీ, ఈ ట్రిప్‌తో తమ బంధం మళ్లీ బాగుపడుతుందని ఆమె ఆశిస్తుంది. ఆ రాత్రి అంతా ప్రశాంతంగానే గడుస్తుంది. కానీ మరుసటి రోజు ఉదయం కళ్లు తెరిచిన ఎమ్మాకు జీవితంలోనే అతిపెద్ద షాక్ ఎదురవుతుంది. ఆమె చేతికి సంకెళ్లు వేసి ఉంటాయి. ఆ సంకెళ్లకు మరో చివర భర్త మార్క్ చేతికి బిగించి ఉంటుంది. ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే మార్క్ తన ముందే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకుంటాడు.
ఒక్క క్షణంలో ఎమ్మా పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతుంది. సంకెళ్ల తాళం కనిపించదు. భర్త శవాన్ని వదిలి ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. బయట గడ్డకట్టే మంచు… లోపల ఆహార కొరత… సహాయం కోసం పిలిచే అవకాశం కూడా ఉండదు. ఎలాగైనా బయటపడాలని ఇంట్లో దొరికిన వస్తువులతో సంకెళ్లు విప్పేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి ప్రయత్నం బెడిసి కొడుతుంది. చివరకు భర్త శవాన్నే ఈడ్చుకుంటూ ఇంట్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.
అయితే అసలు ప్రమాదం అప్పుడే మొదలవుతుంది. కొద్దిసేపటికే ఇద్దరు ప్రమాదకరమైన నేరస్థులు ఆ విల్లాకు చేరుకుంటారు. వాళ్ళు అక్కడికి రావడం యాదృచ్ఛికం కాదని, దీని వెనుక ముందే వేసిన పెద్ద ప్లాన్ ఉందని ఎమ్మా గ్రహిస్తుంది. ఒకవైపు శవానికి బంధించి ఉండటం… మరోవైపు ఇంటి చుట్టూ తిరుగుతున్న హంతకులు… బయట మంచు… ప్రతి క్షణం ఆమెను మరణానికి మరింత దగ్గర చేస్తుంటాయి.
పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్న కొద్దీ ఎమ్మా తన ధైర్యం, తెలివితేటలు, సమయస్ఫూర్తితో ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది. కానీ ప్రతి ప్రయత్నం కొత్త ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఆమె చేసే ఒక్క తప్పు కూడా ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా మారుతుంది. చివరికి ఎమ్మా ఆ సంకెళ్ల నుంచి విముక్తి పొందిందా ? భర్త మార్క్ ఇంత దారుణమైన ప్లాన్ ఎందుకు చేశాడు ? ఆ ఇద్దరు హంతకుల అసలు లక్ష్యం ఏమిటి ? మంచు సరస్సులో జరిగిన చివరి పోరాటం ఎలా ముగిసింది ? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
హాలీవుడ్ సైకాలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ ‘టిల్ డెత్’లో మేగాన్ ఫాక్స్ ప్రధాన పాత్రలో నటించగా, కాలన్ ముల్వే, ఓవెన్ మాకెన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి నుంచి చివరి వరకు ఏం జరుగుతుందో ఊహించలేని ట్విస్టులతో సాగే ఈ సినిమాను డోంట్ మిస్.
Read Also: ప్రియుడిని చంపి పాతిపెట్టే సీఐ… ప్రియురాలు ఇచ్చే షాక్ కు దిమాక్ కరాబ్