రివ్యూ : మోతెవరి లవ్ స్టోరీ (Mothevari Love Story) విడుదల తేదీ: ఆగస్టు 8
ప్లాట్‌ఫామ్: ZEE5
నటీనటులు: అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల, మురళీధర్ గౌడ్, సదన్న, విజయ లక్ష్మి బలగం, సుజాత, గంగవ్వ
దర్శకుడు: శివ కృష్ణ బుర్రా
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్
సంగీతం: చరణ్ అర్జున్
ఎపిసోడ్‌లు: 7
Mothevari Love Story Review : తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ 2025 ఆగస్టు 8న ఓటీటీలోకి వచ్చింది. ఇందులో అనిల్ గీలా (పర్శి) , వర్షిణి రెడ్డి జున్నుతుల (అనిత) జంటగా నటించారు. శివ కృష్ణ బుర్రా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆరేపల్లి గ్రామంలో జరుగుతుంది. ఇకపోతే గ్రామీణ నేపథ్యంలో వస్తున్న వెబ్ సిరీస్ లకు ఆదరణ కూడా పెరుగుతోంది. ఇప్పుడు అలాంటి బ్యాక్ డ్రాప్ లోనే వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
పర్శి (అనిల్ గీలా), అనిత (వర్షిణి రెడ్డి జున్నుతుల) అనే ప్రేమ జంట చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. వీళ్ళు తమ ఫ్యామిలీ అనుమతి లేకుండా పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే ఒక పెళ్లి వేడుక సందర్భంగా, కుటుంబ రహస్యం బయటపడటంతో వారి ప్లాన్ తారుమారవుతుంది. మరోవైపు సత్తయ్య (మురళీధర్ గౌడ్), నర్సింగ్ యాదవ్ (సదన్న) అనే ఇద్దరు సోదరులు, తమ తండ్రి మోతెవరి పరశురామ్ ఐదు ఎకరాల భూమిని అనుమవ్వ (విజయ లక్ష్మి బలగం)కు వీలునామా రాసిన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు.
దీనివల్ల ఈ సోదరుల మధ్య మనస్పర్థలు వస్తాయి. ఈ భూమి వివాదం, అనుమవ్వ గతం, ఒక జత బంగారు గాజులు ఈ కథలో కీలక పాత్ర పోషిస్తాయి. పర్శి, అనిత లవ్ స్టోరీ ఈ భూమి తగాదాతో అల్లుకుపోతుంది. క్లైమాక్స్ ఒక ఊహించని మలుపుతో ముగుస్తుంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి? అన్నదే స్టోరీ.
విశ్లేషణ :
“మోతెవరి లవ్ స్టోరీ” సిరీస్ తెలంగాణ గ్రామీణ సంస్కృతి, యాస, సాంప్రదాయాలను ఆకర్షణీయంగా చిత్రీకరిస్తూ, “బలగం” వంటి చిత్రాల శైలిని గుర్తు చేస్తుంది. శివ కృష్ణ బుర్రా దర్శకత్వం కథను హాస్యం, భావోద్వేగంతో నడిపిస్తాయి. అయితే కొన్ని ఎపిసోడ్‌లు సాగదీతగా అనిపిస్తాయి. మొదటి రెండు ఎపిసోడ్‌లు నెమ్మదిగా సాగినా, మూడవ ఎపిసోడ్ నుండి కథ ఆసక్తికరంగా మారుతుంది.
ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, “ఎలదరియా” పాట హృదయాన్ని హత్తుకుంటాయి. అనిత రీల్స్ పిచ్చి ప్రస్తుత తరం యువతను గుర్తు చేస్తుంది. కానీ ఆమె పాత్ర కొన్ని సన్నివేశాల్లో చిరాకును కలిగిస్తుంది. గంగవ్వ కామియో హాస్యాన్ని జోడిస్తుంది.
అసలు సీక్రెట్ అంతా క్లైమాక్స్ లోనే బయటపడుతుంది. రన్ టైమ్ కాస్త చికాకు కలిగిస్తుంది. కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆశించిన రేంజ్ లో లేకపోవడం నిరాశను కలిగిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
నటన
తెలంగాణ సంస్కృతి
కామెడీ
మైనస్ పాయింట్స్ :
హీరోయిన్ పాత్ర
రన్ టైం
ఎడిటింగ్
క్లైమాక్స్
మొత్తానికి.. ఒక రిఫ్రెషింగ్ స్టోరీ కోరుకునే వారికి ఈ సిరీస్ వీకెండ్ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ దొరికినట్టే.
Mothevari Love Story Web Series Rating 2 /5