OTT Movie : మలయాళ సినిమాలకి ఇప్పుడున్న క్రేజ్ వేరే లెవెల్. ఈ సినిమాలను ఓటీటీలో ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. అందుకు తగ్గట్టు సరికొత్త స్టోరీలతో ముందుకు వస్తున్నారు దర్శకులు. ఐతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక ఆదివాసీ ఉద్యమం చుట్టూ తిరుగుతుంది. ఒక యాక్షన్ థ్రిల్లర్ గా దీనిని తెరకెక్కించారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….
సోనీ లివ్ (SonyLIV) లో
ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నరివేట్ట’ (Narivetta). 2025 లో విడుదలైన ఈ సినిమాకి అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2003లో కేరళలోని వయనాడ్‌లో జరిగిన ముత్తంగా ఆదివాసీ ఉద్యమం నుండి ప్రేరణ పొందింది. ఇది భూమి హక్కులు, రాష్ట్ర అధికారం, అణగారిన సామాజిక పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, సురాజ్ వెంజరమూడు, ఆర్య సలీం, ప్రియంవద కృష్ణన్, చెరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025, జూలై 11 నుంచి సోనీ లివ్ (SonyLIV) లో మలయాళం, హిందీ, తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 2003 సంవత్సరంలో కేరళలోని కుట్టనాడ్, వయనాడ్‌లో జరుగుతుంది. వర్గీస్ పీటర్ అనే 28 ఏళ్ల యువకుడు, ఒక గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటుంటాడు. కానీ అతని వింత వైఖరి కారణంగా ఎటువంటి ఉద్యోగాన్ని సంపాదించలేకపోతాడు. మరోవైపు అతను నాన్సీ (ప్రియంవద కృష్ణన్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆమె అతని స్థిరత్వం లేని మనస్తత్వంతో విసిగిపోయి, అతన్ని పద్దతి మార్చుకోమని చెప్పి విడిపోతుంది. ఒక వైపు కుటుంబ ఒత్తిడి, మరొక వైపు నాన్సీతో సంబంధాన్ని కాపాడుకోవాలనే ఆశతో, వర్గీస్ అయిష్టంగా సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (CRPF)లో కానిస్టేబుల్‌గా చేరతాడు. వర్గీస్‌ను వయనాడ్‌లోని చీయంబం అనే మారుమూల ఆదివాసీ ప్రాంతంలో ఒక CRPF బృందంలో నియమిస్తారు. ఇక్కడ ఆదివాసీలు భూమి హక్కుల కోసం నిరసనలు చేస్తుంటారు. వర్గీస్ మొదట్లో ఈ నిరసనలను అర్థం చేసుకోవడంలో అంతగా ఆసక్తి చూపించడు. ఈ సమయంలో ఒక ఆదివాసీ యువకుడితో ఒక చిన్న విషయంపై వర్గీస్ గొడవపడతాడు. ఇది అతని ఆవేశపూరిత స్వభావాన్ని చూపిస్తుంది.
ఇంతలో వర్గీస్ ఒక సీనియర్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ తో స్నేహం చేస్తాడు. అతను అతనికి ఒక మార్గదర్శకుడిగా మారతాడు. బషీర్ కి ఉన్న జ్ఞానం, దయ వర్గీస్‌పై ప్రభావం చూపుతాయి. కానీ ఇంతలో వయనాడ్‌లో ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఈ నిరసనలను అణచివేయడానికి పోలీసు బృందాన్ని పంపిస్తారు. వర్గీస్ తన విధులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న అన్యాయాల మధ్య చిక్కుకుంటాడు. DIG ఆర్. కేశవదాస్ (చెరన్) నాయకత్వంలో, పోలీసులు ఆదివాసీలను మావోయిస్టులతో పోల్చి , ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో, బషీర్ ను ఒక అడవి ఆపరేషన్‌లో పంపించడం జరుగుతుంది. ఐతే అతను మళ్ళీ తిరిగి రాకపోవడంతో అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. వర్గీస్ తన స్నేహితుడు బషీర్ అదృశ్యం గురించి విచారణ చేయడం ప్రారంభిస్తాడు. ఈక్రమంలో స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుంది. చివరికి బషీర్ కి ఏమవుతుంది ? వర్గీస్ ఈ ఉద్యమానికి అండగా ఉంటాడా ? అతని లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : అదిరిపోయే ఫైట్ సీన్స్, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు… ఓటీటీలోకి వచ్చేసిన సర్వైవల్ హారర్ జాంబీ థ్రిల్లర్